Let's talk: editor@tmv.in
రిపబ్లిక్ డే పరేడ్‌లో నేవీకి ఉత్తమ కవాతు బహుమతి

రిపబ్లిక్ డే పరేడ్‌లో నేవీకి ఉత్తమ కవాతు బహుమతి

Pinjari Chand
30 జనవరి, 2026

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో భారత నౌకాదళం (ఇండియన్ నేవీ) ఉత్తమ కవాతు బృందంగా అవార్డు గెలుచుకుంది. సైన్యానికి చెందిన మూడు దళాల మధ్య జరిగిన పోటీలో నేవీ మార్చింగ్ కంటింజెంట్ అగ్రస్థానాన్ని దక్కించుకుంది అని అధికారులు తెలిపారు. కర్తవ్య పథ్‌పై 144 మంది యువ నావికులతో నేవీ కవాతు బృందం శక్తివంతంగా, క్రమశిక్షణతో కవాతు చేయడం ద్వారా అభివృద్ధి చెందుతున్న సముద్ర బలగంగా తన సత్తాను చాటిందని నేవీ వర్గాలు పేర్కొన్నాయి. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, అనుబంధ బలగాల విభాగంలో ఢిల్లీ పోలీస్ కవాతు బృందం ఉత్తమంగా నిలిచింది.

టాబ్లోల(శకటాలు) విభాగంలో మహారాష్ట్రకు ప్రథమ స్థానం

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల టాబ్లోల విభాగంలో గణేశోత్సవాన్ని ప్రతిబింబించిన మహారాష్ట్ర టాబ్లోకు తొలి బహుమతి లభించింది. జమ్మూ–కశ్మీర్ రెండో స్థానం, కేరళ మూడో స్థానంలో నిలిచాయి. మహారాష్ట్ర టాబ్లోలో సంప్రదాయం–ఆధునికత మేళవింపును ప్రదర్శిస్తూ, గణేశోత్సవాన్ని స్వయం సమృద్ధికి ప్రతీకగా చూపించారు. సంప్రదాయ వస్త్రధారణలో మహిళా కళాకారులు టాబ్లో ఇరువైపులా లెజీమ్ జానపద నృత్యాన్ని ప్రదర్శించారు.

వందేమాతరానికి 150 ఏళ్లు – సంస్కృతి మంత్రిత్వ శాఖ టాబ్లోకు బహుమతి

కేంద్ర మంత్రిత్వ శాఖల విభాగంలో ‘వందేమాతరం’ 150 ఏళ్ల వారసత్వాన్ని ప్రతిబింబించిన సంస్కృతి మంత్రిత్వ శాఖ టాబ్లోకు తొలి బహుమతి లభించింది. ‘వందేమాతరం దేశ ఆత్మనాదం’ అనే ఇతివృత్తంతో రూపొందించిన ఈ టాబ్లోలో బంకిమ్ చంద్ర ఛటర్జీ చేతుల మీదుగా గీతం ఆవిర్భవించిన దృశ్యం, స్వాతంత్ర్య సమరయోధులు, భారతమాత ప్రతిమను ఆకట్టుకునేలా ప్రదర్శించారు. 1928లో మరాఠీ గాయకుడు విశ్ణుపంత్ పాగ్నిస్ ఆలపించిన అరుదైన రికార్డింగ్‌ను కూడా ఇందులో చూపించారు.

ప్రజల ఓటుతో ప్రత్యేక బహుమతులు

‘మైగవ్’ పోర్టల్ ద్వారా నిర్వహించిన ఆన్‌లైన్ పోలింగ్‌లో సైనిక దళాల కవాతులో అస్సాం రెజిమెంట్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ విభాగంలో సీఆర్‌పీఎఫ్, రాష్ట్రాల టాబ్లోలలో గుజరాత్, తదుపరి స్థానాల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ప్రజల ఎంపిక అవార్డులను గెలుచుకున్నాయి. ఈ అవార్డుల ప్రదానోత్సవం జనవరి 30న రాష్ట్రీయ రంగశాల క్యాంప్‌లో జరగనుంది అని అధికారులు తెలిపారు.