Let's talk: editor@tmv.in
రిపబ్లిక్ డే తరహాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి:అమిత్ షా

రిపబ్లిక్ డే తరహాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి:అమిత్ షా

Pinjari Chand
31 అక్టోబర్, 2025

దేశ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన ‘ఉక్కు మనిషి’ సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఈసారి దేశంలో ప్రత్యేకమైన వేడుకలు జరగనున్నాయి. రాష్ట్రీయ ఏకతా దివస్‌ సందర్భంగా కేవాడియాలో (ఏకతా నగర్) రిపబ్లిక్‌ డే తరహాలో గ్రాండ్‌ పరేడ్‌ నిర్వహిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా గురువారం ప్రకటించారు. సర్దార్ పటేల్ స్వాతంత్ర్యం అనంతరం దేశాన్ని ఏకం చేసిన మహానీయుడు. శుక్రవారం ఆయన 150వ జయంతి సందర్భంగా ఒక ప్రత్యేక పరేడ్‌ జరగనుంది. ఇక నుంచి ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 31న ఇలాంటి గ్రాండ్‌ పరేడ్‌ నిర్వహిస్తామని అమిత్‌ షా వెల్లడించారు.

కాంగ్రెస్‌పై విమర్శలు

సర్దార్ పటేల్‌ను స్వతంత్ర్యం అనంతరం కాంగ్రెస్‌ విస్మరించిందని ఆయనకు భారతరత్న ఇవ్వడంలో 41 ఏళ్లు ఆలస్యం చేసిందని షా మండిపడ్డారు. పటేల్‌ స్మారకం కూడా నిర్మించలేదు. కానీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ ప్రపంచ ప్రసిద్ధి పొందిన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని నిర్మించారని గుర్తుచేశారు.

భారత్‌ పర్వ్‌, బిర్సా ముండా జయంతి

నవంబర్‌ 1 నుంచి 15 వరకు ఏకతా నగర్‌లో ‘భారత్‌ పర్వ్‌’ పేరిట సాంస్కృతిక కార్యక్రమాలు, గిరిజన సమాజాల అజేయ వారసత్వం వేడుకలు జరుగుతాయని షా వెల్లడించారు. నవంబర్‌ 15న బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆ వేడుకలు ముగుస్తాయని తెలిపారు.

జాతీయ స్థాయిలో రన్‌ ఫర్‌ యూనిటీ

ఈసారి దేశవ్యాప్తంగా ‘రన్‌ ఫర్‌ యూనిటీ’ కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం, జిల్లా, పోలీస్‌ స్టేషన్‌, విద్యా కేంద్రాల్లో కూడా ఈ పరుగును నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

హాజరు కానున్న ప్రధాని మోడీ

ఈ పరేడ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయం 7.55 గంటలకు కేవాడియాలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని షా తెలిపారు. రిపబ్లిక్‌ డేలో జరిగే పరేడ్‌ మాదిరిగానే, ఈ పరేడ్‌లో కూడా సెంట్రల్‌ ఆర్మ్డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌, రాష్ట్ర పోలీస్‌ దళాలు తమ నైపుణ్యాన్ని, క్రమశిక్షణను, ధైర్యాన్ని ప్రదర్శించనున్నాయి.

పరేడ్‌లో పాల్గొనే దళాలు

బీఎస్‌ఎఫ్‌, సీఐఎస్ఎఫ్‌, ఐటిబిపి, సీఆర్పీఎఫ్‌, ఎస్‌ఎస్‌బీతో పాటు జమ్మూకశ్మీర్‌, పంజాబ్‌, అసోం, త్రిపుర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, కేరళ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ దళాలు పాల్గొంటాయి.

బీఎస్‌ఎఫ్‌ ‘ఆపరేషన్‌ సిందూర్‌’లో పతకాలు సాధించిన 16 మంది వీర సైనికులు, సీఆర్పీఎఫ్‌ నుంచి ఐదుగురు శౌర్యచక్ర అవార్డు గ్రహీతలు ఓపెన్‌ జీప్‌లలో పరేడ్‌లో పాల్గొననున్నారు.

సుమారు 100 మంది సంగీత బృంద సభ్యులతో కూడిన హెరాల్డింగ్‌ టీమ్‌ పరేడ్‌కు నేతృత్వం వహించనుంది. తొమ్మిది బ్యాండ్‌ బృందాలు దేశభక్తి గీతాలతో మురిపించనున్నాయి. అదనంగా నాలుగు స్కూల్‌ బ్యాండ్‌లు రెండు గుజరాత్‌ రాష్ట్ర స్థాయిలో, రెండు జాతీయ స్థాయిలో విజేతలైన జట్లు ప్రత్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నాయి.

రిపబ్లిక్ డే తరహాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి:అమిత్ షా - Tholi Paluku