
రిటైర్ అయినా వదిలిపెట్టం.. చట్టం అతిక్రమించే అధికారులకు హరీష్ రావు హెచ్చరిక!
చట్టాన్ని అతిక్రమిస్తూ రాజకీయ కక్షతో పనిచేసే అధికారులు, పోలీసులను ఎక్కడ దాక్కున్నా, రిటైర్మెంట్ అయినా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర హెచ్చరిక చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ నేతలపై అక్రమ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్న అధికారులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లో నియమించి తమపై ప్రయోగాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరించని అధికారులు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. సప్త సముద్రాల అవతల ఉన్నా చట్టాన్ని ఉల్లంఘించిన వారిని పట్టుకొచ్చి విచారిస్తాం అని హరీష్ రావు అన్నారు.
రేపు అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఆ సమయంలో అక్రమంగా వ్యవహరించిన అధికారులు ప్రభుత్వ సహకారం ఆశించరాదని హెచ్చరించారు. సొంత డబ్బులతో, సొంత లాయర్లను పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. తప్పుడు ఆదేశాలను పాటించి చట్టాన్ని అతిక్రమిస్తే పూర్తి బాధ్యత అధికారులదే అవుతుందని స్పష్టం చేశారు.
దావోస్ నుంచి రేవంత్ రెడ్డి ఇచ్చే డైరెక్షన్ల ప్రకారం కాకుండా, చట్టం ప్రకారమే అధికారులు పనిచేయాలని ఆయన సూచించారు. బీఆర్ఎస్ నేతలపై కుట్రలతో బెదిరింపులకు పాల్పడటం దుర్మార్గమని మండిపడ్డారు. తాము ఏ తప్పూ చేయలేదని, ఎవరికీ భయపడబోమని తెలిపారు. కేటీఆర్ ధైర్యంగా విచారణకు హాజరయ్యారని గుర్తు చేశారు.
గతంలో బీఆర్ఎస్ నాయకులపై అనేక దుష్ప్రచారాలు జరిగినప్పుడు ఎందుకు కేసులు నమోదు చేయలేదని ఆయన ప్రశ్నించారు. మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా కేటీఆర్‌పై తప్పుడు ప్రచారం జరిగినా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డిపై కూడా విచారణ జరిపించి, అన్ని నిజాలు ప్రజల ముందుకు రావాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
