Let's talk: editor@tmv.in
రిటైర్మెంట్ ఆలోచన వచ్చింది.. కానీ ఇంకా సమయం ఉంది: కేఎల్ రాహుల్

రిటైర్మెంట్ ఆలోచన వచ్చింది.. కానీ ఇంకా సమయం ఉంది: కేఎల్ రాహుల్

Shaik Mohammad Shaffee
28 జనవరి, 2026

టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన రిటైర్మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆట నుంచి తప్పుకోవాలనే ఆలోచన తన మనసులోకి వచ్చిందని, అయితే ఆ నిర్ణయం తీసుకునే సమయం ఇంకా రాలేదని స్పష్టం చేశాడు. సమయం వచ్చినప్పుడు మాత్రం ఆలస్యం చేయకుండా గౌరవంగా ఆటకు వీడ్కోలు చెబుతానని చెప్పాడు.

‘రిటైర్మెంట్ అంత కష్టం కాదు’

ఇటీవల ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ తన భవిష్యత్తు గురించి మాట్లాడారు. "రిటైర్మెంట్ ప్రకటించడం నాకు పెద్ద కష్టమైన పని కాదు. ఆట కంటే జీవితం చాలా పెద్దది. మనకు మనం నిజాయితీగా ఉంటే, ఇక చాలు అనిపించినప్పుడు తప్పుకోవడమే మంచిది. అనవసరంగా కెరీర్‌ను లాగడం వల్ల ఉపయోగం లేదు" అని 33 ఏళ్ల రాహుల్ తన మనసులో మాటను బయటపెట్టారు.

‘ముఖ్యమైనవి ఇంకా చాలా ఉన్నాయి’

క్రికెట్ కంటే తన కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని రాహుల్ చెప్పారు. "నేనేమీ పెద్ద సూపర్ స్టార్‌ని అని లేదా నేను లేకపోతే క్రికెట్ ఆగిపోతుందని నేను అనుకోను. మన దేశంలో క్రికెట్ ఎప్పుడూ సాగుతూనే ఉంటుంది. ముఖ్యంగా మా బాబు పుట్టిన తర్వాత జీవితం పట్ల నా చూపు పూర్తిగా మారిపోయింది. కుటుంబంతో గడపడం, జీవితాన్ని ఆస్వాదించడమే నాకు ముఖ్యం" అని ఆయన వివరించారు.

గాయాలతో మానసిక పోరాటం

తన కెరీర్‌లో ఎదుర్కొన్న వరుస గాయాలే రిటైర్మెంట్ గురించి ఆలోచించేలా చేశాయని రాహుల్ అంగీకరించారు. "శారీరక నొప్పి కంటే, మానసిక పోరాటమే చాలా కష్టం. పదే పదే గాయాలపాలైనప్పుడు 'ఇక చాలు.. క్రికెట్ నీకు కావాల్సినంత డబ్బు ఇచ్చింది, ఇక ఆపేయ్' అని మనసు చెబుతుంది. కానీ ఆ మానసిక సంఘర్షణను దాటుకుని రావడం పెద్ద యుద్ధం లాంటిది" అని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.

మూడు ఫార్మాట్లలో రాహుల్ ప్రదర్శన

భారత జట్టుకు అన్ని ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా ఉన్న రాహుల్ ఇప్పటివరకు 67 టెస్టుల్లో 35.8 సగటుతో 4,053 పరుగులు చేశాడు. ఇక వన్డేల విషయానికొస్తే, 94 మ్యాచ్‌ల్లో ఏకంగా 50.9 సగటుతో 3,360 పరుగులు చేసి జట్టులో నమ్మకమైన ఆటగాడిగా గుర్తింపు పొందారు. కేవలం సుదీర్ఘ ఫార్మాట్లే కాకుండా, మెరుపు వేగంతో సాగే 72 టీ20 మ్యాచ్‌ల్లో కూడా 2,265 పరుగులు చేసి తన సత్తా చాటారు.

రంజీ ట్రోఫీలో తదుపరి పోరు

ప్రస్తుతం రాహుల్ మళ్లీ తన ఫామ్‌ను నిరూపించుకునే పనిలో పడ్డారు. కర్ణాటక జట్టు తరఫున పంజాబ్‌తో జరగబోయే కీలకమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో ఆయన ఆడనున్నారు. మొహాలీ వేదికగా గురువారం నుంచి ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో రాహుల్ ఎలా రాణిస్తారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.