
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి.. బీజేపీ ఎమ్మెల్యే కేవీఆర్ నిరాహార దీక్ష
తెలంగాణలోని రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి (కేవీఆర్) ఇందిరాపార్క్ వద్ద గల ధర్నా చౌక్ చేపట్టిన నిరాహార దీక్షకు బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మద్దతు తెలిపారు. సోమవారం ఈ దీక్షలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన పెండింగ్ మొత్తాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు సంబంధించిన బకాయిలు కూడా ఆలస్యం చేయకుండా చెల్లించాలని కోరారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సూచించారు.
అలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనపై విమర్శలు గుప్పించారు. తెలంగాణకు న్యాయం చేయడం లేదా ఎన్నికల హామీల అమలు లక్ష్యంగా కాకుండా, ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల కోసం తెలంగాణ నిధులను మళ్లించడమే ఆ పర్యటన ఉద్దేశమని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం వినియోగించాల్సిన పెద్ద మొత్తంలో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ పరిణామాలపై స్పందన
ఇక ఇరాన్ అధ్యక్షుడి మరణం నేపథ్యంలో దేశంలో నిర్వహిస్తున్న ర్యాలీలపై కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశీయ సమస్యలపై ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేయడం సహజమే అయినప్పటికీ, విదేశీ నాయకుడి మరణంపై ర్యాలీలు నిర్వహించడం సమంజసం కాదని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలోని ముస్లింలు సురక్షితంగా జీవిస్తూ, వివిధ సంక్షేమ పథకాల లబ్ధిని పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ సర్కార్‌పై ఎన్. రామచందర్ రావు విమర్శలు
రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లు, బకాయిల చెల్లింపులో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండివైఖరిపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రిటైర్డ్ ఉద్యోగుల నిరసన దీక్షలో పాల్గొన్న ఆయన, ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించేందుకు డబ్బులు లేవని ప్రభుత్వం చెబుతుండగా, నేషనల్ హెరాల్డ్ పత్రికకు రూ.1000 కోట్లు కేటాయించేందుకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. రాష్ట్రంలోని పేదలు, ఉద్యోగుల కంటే పార్టీ పత్రిక ముఖ్యమా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెన్షన్లు, ఇతర బకాయిలను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదనల కారణంగా 66 మందికి పైగా పెన్షనర్లు ఆత్మహత్యలకు పాల్పడినట్లు సమాచారం ఉందని చెప్పారు. ఇది పరిపాలనా వైఫల్యం మాత్రమే కాకుండా మానవీయ సంక్షోభమని ఆయన అభివర్ణించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఇళ్లను కూల్చే గడపార ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. మూసీ నుంచి ఖమ్మం వరకు పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేస్తోందని ఆరోపించారు.
రాహుల్ గాంధీకి ప్రశ్నలు
ఇక రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై స్పందిస్తూ, ఎన్నికల సమయంలో చేసిన చేవెళ్ల, కామారెడ్డి, వరంగల్ డిక్లరేషన్ల హామీలు అమలయ్యాయా అని ప్రశ్నించారు. ఎస్సీలు, బీసీలు, రైతులకు న్యాయం జరిగిందా అని సమాధానం కోరారు. విశ్రాంతి ఉద్యోగులు నిరాశ చెందకుండా చట్టబద్ధ మార్గంలో పోరాడాలని, వారి హక్కుల కోసం బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రామచందర్ రావు హామీ ఇచ్చారు.
