Let's talk: editor@tmv.in
రిటైర్డ్ ఇంజనీర్ ఇంట లోకాయుక్త భారీ దాడులు

రిటైర్డ్ ఇంజనీర్ ఇంట లోకాయుక్త భారీ దాడులు

Panthagani Anusha
11 అక్టోబర్, 2025

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి కుంభకోణాలు వరుసగా బయటపడుతున్న తరుణంలో లోకాయుక్త పోలీసులు మరొక పెద్ద ఆపరేషన్ చేపట్టారు. ప్రజా పనుల శాఖ లో చీఫ్ ఇంజనీర్‌గా పదవీ విరమణ చేసిన జి.పి. మెహ్రాకు నివాసాలలో, కార్యాలయాలపై గురువారం లోకాయుక్త పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. మెహ్రా తన ఉద్యోగ కాలంలో ఆదాయానికి మించిన ఆస్తులను కూడబెట్టారన్న పక్కా సమాచారంతో చేపట్టిన ఈ దాడుల్లో కోట్ల విలువైన అక్రమాస్తుల చిట్టా బయటపడింది.

లోకాయుక్త డైరెక్టర్ జనరల్ యోగేశ్ దేశ్‌ముఖా పర్యవేక్షణలో జరిగిన ఈ సోదాల్లో అధికారులు ఊహించని మొత్తంలో నగదు, కిలోల కొద్దీ బంగారం, స్థిరాస్తి పత్రాలు, ఖరీదైన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్‌లో లోకాయుక్త దాడులు పెను సంచలనాలను సృష్టిస్తున్నాయి. నెలకు కేవలం వేలల్లో జీతం తీసుకునే చిరుద్యోగులు సైతం కోట్లాది రూపాయల అక్రమాస్తులను పోగేసిన ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అత్యున్నత పదవిలో పనిచేసిన మెహ్రాపై జరిగిన ఈ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించాయి.

భోపాల్ నివాసాల్లో నగదు, బంగారం పట్టివేత

మెహ్రాపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసిన లోకాయుక్త అధికారులు తదనంతరం మెహ్రా భోపాల్‌లోని రెండు నివాసాల్లో సోదాలు నిర్వహించగా గణనీయమైన మొత్తంలో అక్రమ నగదు, ఆభరణాలు పట్టుబడ్డాయి. ఈ సోదాల్లో ఓపాల్ రీజెన్సీ ఫ్లాట్ లో రూ. 26 లక్షల నగదు, సుమారు రూ. 3.05 కోట్ల విలువైన 2.649 కిలోల బంగారం, 5.523 కిలోల వెండి లభించాయి. ఇక మణిపురం నివాసంలో రూ. 8.79 లక్షల నగదు, దాదాపు రూ.50 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు,రూ.56 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రెండు చోట్లా కలిపి మొత్తం రూ.34.79 లక్షల నగదు రికవరీ అయింది.

ఫామ్‌హౌస్‌లో 17 టన్నుల తేనె, రిసార్ట్ తరహా నిర్మాణాలు

ఈ సోదాల్లో అధికారులు నర్మదాపురం జిల్లాలోని సోహాగ్‌పూర్ పరిధిలోని సైనీ గ్రామంలో ఉన్న మెహ్రాకు చెందిన ఫామ్‌హౌస్‌ను చూసి షాక్‌ అయ్యారు. వ్యవసాయానికి సంబంధించిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి:

తేనె నిల్వ: ఏకంగా 17 టన్నుల తేనె నిల్వలు లభించడంతో మెహ్రా ప్రభుత్వోద్యోగిగా ఉంటూ రహస్యంగా తేనె వ్యాపారం చేస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.

రిసార్ట్ తరహా ప్రాంగణం: *ఈ ఆస్తిలో 32 నిర్మాణంలో ఉన్న కాటేజీలు, ఏడు పూర్తయిన కాటేజీలు, రెండు చేపల పెంపకం కేంద్రాలు (ఫిష్ ఫారాలు), రెండు పెద్ద చెరువులు, ఒక ఆలయం, రెండు గోశాలలు ఉన్నట్లు గుర్తించారు.

వ్యవసాయ యంత్రాలు: ఆరు ట్రాక్టర్లు, ఖరీదైన వ్యవసాయ యంత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వ్యాపారాలు, లగ్జరీ వాహనాలు స్వాధీనం

భోపాల్‌లోని గోవింద్‌పురా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న కేటీ ఇండస్ట్రీస్ అనే పైపుల తయారీ ఫ్యాక్టరీలో లోకాయుక్త బృందం సోదాలు నిర్వహించింది. ఈ యూనిట్ మెహ్రా కుమారుడు రోహిత్, కైలాష్ నాయక్ అనే వ్యక్తి సంయుక్త యాజమాన్యంలో ఉన్నట్లు తేలింది. ఈ పరిస్త్రమునుండే నుండి ఫ్యాక్టరీ సామగ్రి, ముడిసరుకుతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అధికారులు

అధికారులు మెహ్రా, ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న ఫోర్డ్ ఎండీవర్, స్కోడా స్లావియా, కియా సోనెట్, మారుతి సియాజ్ వంటి లగ్జరీ కార్లను గుర్తించారు. అంతేకాకుండా ఫిక్స్‌డ్ డిపాజిట్లు, షేర్లు, బీమా పాలసీలకు సంబంధించిన పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మెహ్రా అక్రమాస్తుల మొత్తం విలువ అనేక కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న పత్రాలను విశ్లేషించిన తర్వాతే స్వాధీనం చేసుకున్న మొత్తం ఆస్తి విలువ ఎంత అనేది పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.