Let's talk: editor@tmv.in
రిటైర్డ్ అంగన్‌వాడీల పెన్షన్లకు రూ.20 కోట్లు మంజూరు: కేరళ ప్రభుత్వం

రిటైర్డ్ అంగన్‌వాడీల పెన్షన్లకు రూ.20 కోట్లు మంజూరు: కేరళ ప్రభుత్వం

Panthagani Anusha
6 నవంబర్, 2025

లక్షలాది మంది చిన్నారులకు, గర్భిణీ స్త్రీలకు సేవలు అందించిన అంగన్‌వాడీ కార్మికులు, సహాయకుల పదవీ విరమణ జీవితానికి భద్రత కల్పించేందుకు కేరళ ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. వారి పెన్షన్లు, ఇతర సంక్షేమ ప్రయోజనాలు నిలిచిపోకుండా ఉండేందుకు వీలుగా రూ. 20 కోట్లను తక్షణమే మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులను ప్రత్యేకంగా అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సంక్షేమ నిధి బోర్డుకు బదిలీ చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి కె.ఎన్. బాలగోపాల్ వెల్లడించారు.

ఈ నిధులు ప్రధానంగా రిటైర్ అయిన సభ్యులకు పింఛన్లు, వారు మరణించిన పక్షంలో వారి కుటుంబాలకు అందించే మరణానంతర సహాయానికి వినియోగిస్తారు. సంక్షేమ నిధి బోర్డుకు ఆర్థిక వనరులు సరిపోకపోవడం వల్ల, ప్రభుత్వ సహాయంతోనే ఈ వివిధ ప్రయోజనాలను పంపిణీ చేయాల్సి వస్తోందని ఆర్థిక మంత్రి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ కేటాయింపు ద్వారా అంగన్‌వాడీ కార్యకర్తల దీర్ఘకాల సేవలకు తగిన భద్రత కల్పించడంలో ప్రభుత్వం తన నిబద్ధతను తెలియజేస్తోంది.ప్రస్తుతం ఈ బోర్డుకు సంక్షేమ నిధి వాటాగా ప్రతి నెలా రూ. 2.15 కోట్లు వస్తోంది. అయితే, కేవలం పింఛన్ల పంపిణీకే నెలకు రూ. 4.26 కోట్లు అవసరమవుతున్నట్లు మంత్రి బాలగోపాల్ వివరించారు.

గత నాలుగేళ్లలో రూ. 76 కోట్ల మద్దతు

తాజా నిధుల కేటాయింపుతో పాటు, గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో కేరళ ప్రభుత్వం ఈ సంక్షేమ బోర్డుకు రూ. 76 కోట్లు ఆర్థిక సాయం అందించినట్లు మంత్రి బాలగోపాల్ తెలిపారు . సుదీర్ఘకాలం సమాజానికి సేవ చేసిన అంగన్‌వాడీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిబద్ధతను ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ చర్యతో వేలాది మంది రిటైర్డ్ అంగన్‌వాడీ సిబ్బందికి తమ పెన్షన్లు సక్రమంగా అందుతాయనే భరోసా లభించింది.

కేరళ సంక్షేమ నిధి: అంగన్‌వాడీల పెన్షన్ ఎంత?

కేరళ ప్రభుత్వం రిటైర్డ్ అంగన్వాడీ ఉద్యోగులకు అందించే పెన్షన్, ఇతర ప్రయోజనాలు “కేరళ అంగన్వాడీ వర్కర్ల ,అంగన్వాడీ హెల్పర్ల సంక్షేమ నిధి చట్టం–2016” ఆధారంగా అమలు చేస్తుంది. ఈ చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన వెల్ఫేర్ ఫండ్ బోర్డ్ ద్వారా ఉద్యోగ విరమణ చేసిన అంగన్వాడీ ఉద్యోగులకు నెలకు రూ. 1,000 పెన్షన్, హెల్పర్లకు నెలకు రూ. 600 పెన్షన్ అందజేస్తారు.