

రిజ్వీ మెరుపు ఇన్నింగ్స్.. ముంబైపై ఢిల్లీ ఘన విజయం
యువ బ్యాటర్ సమీర్ రిజ్వీ అద్భుత అర్ధశతకంతో రాణించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ముంబై ఇండియన్స్ పై ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ తమ తొలి హోం గ్రౌండ్‌లోనే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో గెలుపొందింది.
163 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన ఢిల్లీ జట్టు యువ ఆటగాడు సమీర్ రిజ్వీ అద్భుత ఇన్నింగ్స్‌తో విజయంలో కీలక పాత్ర పోషించాడు. 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 90 పరుగులు చేసి జట్టును విజయానికి దగ్గర చేశాడు. అతనికి పాతుం నిస్సాంక (30 బంతుల్లో 44) మంచి మద్దతు ఇచ్చాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి జట్టును గాడిలో పెట్టారు. తర్వాత రిజ్వీకి డేవిడ్ మిల్లర్ (17 నాటౌట్) తోడయ్యాడు. వీరిద్దరూ నాల్గో వికెట్‌కు 78 పరుగులు జోడించడంతో ఢిల్లీ 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. అద్భుతంగా ఆడిన రిజ్వీ శతకం చేజారినా ప్రేక్షకుల నుంచి అభినందనలు అందుకున్నాడు.
ముంబై ఇండియన్స్‌ను కట్టడి చేసిన ఢిల్లీ బౌలర్లు
ఇంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 162 పరుగులు చేసింది. తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 51 పరుగులతో అర్ధశతకం సాధించి జట్టును నిలబెట్టాడు. రోహిత్ శర్మ 35 పరుగులు చేశాడు. అయితే ఇతర బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. కానీ ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై జట్టు పెద్ద స్కోరు చేయలేకపోయింది. చివర్లో నమన్ ధీర్ 28 పరుగులు చేసినప్పటికీ ముంబై 162 పరుగులకే పరిమితమైంది. మొదట్లోనే ముంబైకి ఎదురుదెబ్బ తగిలింది. ముకేశ్‌కుమార్ బౌలింగ్‌లో రియాన్ రికెల్‌టన్ ఔటవ్వగా, వెంటనే తిలక్ వర్మ డకౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత రోహిత్–సూర్యకుమార్ జోడీ 53 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను నిలబెట్టింది.
ఢిల్లీ బౌలర్లలో కెప్టెన్ అక్షర్‌పటేల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 22 పరుగులు ఇచ్చి రోహిత్ శర్మ వికెట్ తీసాడు. ముఖేశ్‌కుమార్ (2/26), లుంగి నింగిడి (1/34), టీ.నటరాజన్ (1/24) కీలక వికెట్లు సాధించారు. స్పిన్నర్ విప్‌రాజ్ నిగం (1/24) కూడా ఒక వికెట్ తీసి రాణించాడు. రిజ్వీ అద్భుత ఇన్నింగ్స్, బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.
