Let's talk: editor@tmv.in
“రిజర్వేషన్లు బిక్ష కాదు, హక్కు”: బీసీ జేఏసీ

“రిజర్వేషన్లు బిక్ష కాదు, హక్కు”: బీసీ జేఏసీ

Gaddamidi Naveen
3 నవంబర్, 2025

“రిజర్వేషన్లు బిక్ష కాదు, మా హక్కు” అంటూ బీసీ జేఏసీ నిర్వహించిన రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం ఉత్సాహభరితంగా సాగింది. 42 శాతం రిజర్వేషన్ల సాధనకు భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు బంజారాహిల్స్‌లోని కళింగ భవన్‌లో ఈ సమావేశం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా బీసీ సంఘాలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఉద్యమాల పుట్టినిల్లు తెలంగాణలో బీసీల చైతన్యం మళ్లీ అలజడి సృష్టిస్తోంది. ఈ సందర్భంగా పాల్గొన్న నేతలు మాట్లాడుతూ “మన సమాజం ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది, చైతన్యం మన లక్షణం, తెలంగాణ ప్రజలు అన్యాయాన్ని సహించరు” అని పేర్కొన్నారు.

జేఏసీ భవిష్యత్తు దిశగా కొన్ని ముఖ్య సూచనలు చేశారు. జేఏసీ అందరిదిగా ఉండాలని, అది ఒక్క రాజకీయ నాయకుడి ఆధీనంలో ఉండకూడదని స్పష్టం చేశారు. “నిక్కచ్చిగా నడిపేవారే నాయకత్వం వహించాలి. అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉద్యమానికి భాగస్వాములు కావాలి. రాజకీయ పక్షపాతం లేకుండా అందరినీ కలిపి నడవగలిగితేనే విజయాన్ని సాధించవచ్చు” అని సూచించారు.

రాజ్యాధికారంపై ఆత్మపరిశీలన

తెలంగాణ జేఏసీ ఉద్యమం గుర్తు చేస్తూ, “ఈ వేదిక ఎవరికి వారు పార్టీ ఉపన్యాసాలు ఇచ్చేది కాదు. ఒక్కటే సిద్ధాంతం రాజ్యాధికారం సాధించడం” అని తెలిపారు. స్వతంత్రం వచ్చి భారతదేశానికి 78 ఏళ్లు అయినా, తెలంగాణలో ఇప్పటివరకు బీసీ వర్గానికి సీఎం పదవి రాకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. మ‌నమే ఎక్కువమంది ఉన్నా, మనమే వెనుకబడ్డాం. ఇతరులను విమర్శించకుండా, మనలో మనం ప్రశ్నించుకోవాలి. మన హక్కు కోసం మనం పోరాడుతున్నామ‌ని అన్నారు.

అంబేద్కర్ స్ఫూర్తిని ప్రస్తావిస్తూ, కులం, మతం, పేదరికం విజ్ఞానానికి అడ్డంకి కావు. రిజర్వేషన్లు నాణ్యత తగ్గిస్తున్నాయని చెప్పేవారు తప్పుదారి పట్టిస్తున్నారు. డబ్బులతో సీట్లు కొనేవారే నాణ్యత కోల్పోతున్నారు అని అన్నారు.

బీసీ బంద్ విజయాన్ని గుర్తుచేస్తూ, ఇప్పుడే కాకపోతే ఇక ఎప్పుడూ రాదు అనే ఆలోచన సమాజంలో మేలుకొచ్చింది. మన సమైక్యతే బలం. జేఏసీ అంటే ఒక్కటే జెండా, ఒక్కటే ఎజెండా” అని పిలుపునిచ్చారు.

రాజ్యాధికారం, వ్యవస్థ మార్పు లక్ష్యం

ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలను ఉదహరిస్తూ, “మంద కృష్ణ ఉద్యమం చూసి మోదీ చెప్పారు. ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అణగదొక్కే అధికారం ఎవరికీ లేదు అని. అదే మన బలం అని అన్నారు.రిజర్వేషన్లు కేవలం స్థానిక సంస్థల్లోనే కాదు, చట్టసభల్లో, మంత్రివర్గాల్లో కూడా మన వాటా రావాలి. అలాగే డబ్బులతో ఓట్లు కొనుక్కునే వ్యవస్థను బీసీ జేఏసీ నిర్మూలించాలి. పెట్టుబడి రాజకీయాలను ధ్వంసం చేయాలి. మనం ఆశయాన్ని ముద్దాడే వరకు ఆగకూడదని హితవు పలికారు.

ఈ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, నేతలు బీసీల హక్కుల కోసం జేఏసీ కట్టుబడి పనిచేయాలి. ఇది కోట్ల మంది భవిష్యత్తు కోసం నడుస్తున్న చారిత్రాత్మక ఉద్యమం అని ఉత్సాహపరిచారు.ఈ కార్య‌క్ర‌మంలో బీసీ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, బీసీ వర్గాల ప్రజాప్రతినిధులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,మాజీ ఎంపీలు,పలువురు సామాజిక సంఘాల ప్రతినిధులు, ఉద్యమకారులు పాల్గొన్నారు.

“రిజర్వేషన్లు బిక్ష కాదు, హక్కు”: బీసీ జేఏసీ - Tholi Paluku