
రిజర్వేషన్లపై సుప్రీంకు వెళ్లాలి : ఎమ్మెల్సీ కవిత డిమాండ్
స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 9ను హైకోర్టు కొట్టివేయడంతో.. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. బీసీ రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.హైకోర్టు ఉత్తర్వులు తీసుకున్న ఆమె న్యాయ నిపుణులతో చర్చించినట్లు తెలిపారు కవిత.
నిజాయితీ కొరవడింది
బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం నిజాయితీ లేదని, గత ఆరు నెలలుగా శాసనసభ, మండలి ఆమోదించిన బిల్లులకు గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం పొందడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం జరిగిందని కవిత మండిపడ్డారు. కాంగ్రెస్ చిత్తశుద్ధి లేకపోవడానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ‘‘స్థానిక సంస్థలకు వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలనే సుప్రీంకోర్టు సూత్రాన్ని గౌరవించకుండా, గవర్నర్, రాష్ట్రపతి ఆమోదం పొందడంలో జరిగిన అతి జాప్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సుప్రీంకోర్టులో సవాలు చేయాలి. ఆ ఆలస్యం సుప్రీంకోర్టు స్ఫూర్తికే విరుద్ధం అన్నారు కవిత.
సుప్రీంకు వెళ్లాలి
ఎన్నికలు త్వరగా జరగడం ముఖ్యం కాదు, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయడం ద్వారా సామాజిక న్యాయం నిర్ధారించడమే అత్యంత ముఖ్యం. ఈ విషయంలో ప్రభుత్వం రాజీ పడకూడదు అన్నారు. బీసీలకు న్యాయం చేయడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. కనీసం ఇప్పుడైనా మేల్కొని బిల్లు ఆమోదంలో జరిగిన జాప్యాన్ని, హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ తక్షణమే సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆమె డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ బీసీల పక్షాన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో, ఎమ్మెల్సీ కవిత చేసిన ఈ రాజకీయ విమర్శలు, న్యాయపరమైన డిమాండ్‌లు తెలంగాణ స్థానిక ఎన్నికల అంశాన్ని మరోసారి కీలక మలుపు తిప్పాయి. బీసీల రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
