Let's talk: editor@tmv.in
రికార్డు స్థాయిలో భారత్-చైనా ట్రేడ్.. 155 బిలియన్ డాలర్లకు చేరిన వాణిజ్యం

రికార్డు స్థాయిలో భారత్-చైనా ట్రేడ్.. 155 బిలియన్ డాలర్లకు చేరిన వాణిజ్యం

Shaik Mohammad Shaffee
5 ఫిబ్రవరి, 2026

భారత్- చైనా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. 2025 సంవత్సరంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 155.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.13 లక్షల కోట్లు) చేరుకుందని భారత్‌లోని చైనా రాయబారి జూ ఫీహాంగ్ వెల్లడించారు. మంగళవారం రాజధానిలో జరిగిన 'చైనీస్ న్యూ ఇయర్' వేడుకల్లో ఆయన ప్రసంగిస్తూ.. గత ఏడాదితో పోలిస్తే వాణిజ్య లావాదేవీల్లో 12 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. ముఖ్యంగా చైనాకు భారత్ చేసే ఎగుమతులు కూడా 9.7 శాతం పెరగడం గమనార్హమని, ఇది ఇరు దేశాల మధ్య ఉన్న అపారమైన ఆర్థిక అవకాశాలకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఆర్థిక, వాణిజ్య రంగాల్లో సహకారానికి ఇంకా భారీ అవకాశాలు ఉన్నాయని, ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు పెరగడం శుభపరిణామమని హర్షం వ్యక్తం చేశారు.

మోడీ-షీ జిన్‌పింగ్ భేటీతో మారిన ముఖచిత్రం

గతేడాది ఆగస్టులో టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మధ్య జరిగిన భేటీ ఇరు దేశాల సంబంధాల్లో ఒక కీలక మలుపుగా రాయబారి అభివర్ణించారు. ఆ సమావేశం తర్వాత భారత్-చైనా సంబంధాలు 'పునఃప్రారంభం' (రీసెట్) నుంచి ఒక కొత్త స్థాయికి చేరుకున్నాయని, అప్పటి నుంచి అన్ని స్థాయిలలో చర్చలు, ప్రజల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడ్డాయని ఆయన గుర్తుచేశారు. 2020 గాల్వాన్ లోయ ఉదంతం తర్వాత తీవ్ర ఉద్రిక్తతలకు గురైన సంబంధాలు, 2024 అక్టోబర్‌లో సైనిక ఉపసంహరణ ప్రక్రియ పూర్తి కావడంతో తిరిగి కుదుటపడ్డ విషయం తెలిసిందే.

ఆలోచనల్లో సారూప్యత.. ఒకే లక్ష్యం

ప్రపంచ శాంతి, సౌభాగ్యాల విషయంలో భారత్, చైనా దేశాల ఆలోచనా దృక్పథం ఒక్కటేనని జూ ఫీహాంగ్ స్పష్టం చేశారు. భారత్ ప్రతిపాదించే 'వసుధైవ కుటుంబకమ్' (ప్రపంచమంతా ఒకే కుటుంబం) సిద్ధాంతానికి, చైనా ఆకాంక్షించే 'ప్రపంచ సామరస్యం' (వరల్డ్ ఆఫ్ గ్రేట్ హార్మనీ) అనే భావనకు దగ్గరి పోలికలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆత్మనిర్భర్ భారత్’ విధానం, చైనా ప్రాధాన్యతనిచ్చే ‘స్వయం శక్తి’ సిద్ధాంతంతో ఏకీభవిస్తుందని తెలిపారు. ఇరు దేశాలు తమ అభివృద్ధి కోసం ఒకే రకమైన వ్యూహాలను అనుసరిస్తున్నాయని, ఇది భవిష్యత్తులో గ్లోబల్ సౌత్ (అభివృద్ధి చెందుతున్న దేశాల) ప్రయోజనాల కోసం సంయుక్తంగా కృషి చేయడానికి తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రిక్స్ అధ్యక్ష పదవిలో ఉన్న భారత్‌కు చైనా పూర్తి మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

సాంస్కృతిక బంధం.. పర్యాటకానికి పెద్దపీట

మరోవైపు కోల్‌కతాలో జరిగిన వేడుకల్లో చైనా కాన్సుల్ జనరల్ జూ వీ మాట్లాడుతూ.. భారత్, చైనాల మధ్య ఉన్న బలమైన సాంస్కృతిక సంబంధాలను కొనియాడారు. భారతీయ కళాకారులు చైనీస్ మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శించడం, చైనీస్ భాషలో పాటలు పాడటం ఇరు దేశాల మధ్య ఉన్న ఆత్మీయతకు నిదర్శనమని అన్నారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం వీసా నిబంధనలను సడలించడాన్ని ఆయన స్వాగతించారు. చైనా పర్యాటకులు ‘అమేజింగ్ ఇండియా’ను సందర్శించేలా పర్యాటక సంస్థలతో చర్చలు జరుపుతున్నామని, ఇరు దేశాల మధ్య మరిన్ని విమాన సర్వీసులు ప్రారంభం కావాలని ఆశిస్తున్నామని ఆయన తెలిపారు.