
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి: బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి
ద్రవ్యోల్బణంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాహుల్ గాంధీ మాటలు అపరిపక్వంగా, అజ్ఞానంతో ప్రజలను రెచ్చగొట్టేలా ఉన్నాయని బీజేపీ నేత ప్రకాష్ రెడ్డి ఆదివారం మండిపడ్డారు. ఎటువంటి శాస్త్రీయ వివరణ లేకుండా దేశంలో ధరలు పెరుగుతాయని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన విమర్శించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్పందిస్తూ ప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ చేసిన ట్వీట్ దురదృష్టకరం. శాస్త్రీయమైన విశ్లేషణ లేకుండా భారత్ ద్రవ్యోల్బణంలోకి వెళ్తుందని ఆయన ఎలా చెబుతారు? ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న వ్యాఖ్యలు మాత్రమే. తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి, రాబోయే ఎన్నికల ఎజెండా కోసం ఆయన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు అని విమర్శించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని, ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతుందంటూ భయాందోళనలు సృష్టించడం బాధ్యతారాహిత్యమని ఆయన హితవు పలికారు.
రాహుల్ గాంధీ ఆరోపణలు ఏమిటి?
ఇదిలా ఉండగా, శనివారం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా రాహుల్ గాంధీ దేశ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే పడిపోవడం, పారిశ్రామిక ఇంధన ధరలు పెరగడం వంటి అంశాలు రాబోయే ద్రవ్యోల్బణానికి సంకేతాలని ఆయన పేర్కొన్నారు.
ఈ పరిస్థితుల్లో పారిశ్రామిక ఇంధన ధరల పెరుగుదల వల్ల ఉత్పత్తి, రవాణా ఖర్చులు పెరుగుతాయని, దీని ప్రభావం సామాన్యుడిపై పడుతుందని అభిప్రాయపడ్డారు.రోజువారీ అవసరాల ధరలు పెరగడంతో కుటుంబాలపై ఆర్థిక భారం అధికమవుతుందని, విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్లే అవకాశముందని కూడా హెచ్చరించారు. అదేవిధంగా ఎన్నికల తర్వాత పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ ధరలు పెరగవచ్చని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం వద్ద సరైన దిశా నిర్దేశం లేదని, కేవలం మాటలకే పరిమితమైందని విమర్శించారు.
