
‘రాహుల్ గాంధీ, మరో 25 మంది కాంగ్రెస్ ఎంపీలను కాల్చేస్తా’
రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎంపీలను కాల్చేస్తానని బెదిరిస్తూ వీడియో విడుదల చేసిన వ్యక్తిని రాజస్థాన్‌లోని కోటాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజ్ సింగ్‌గా తనను తాను పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి, తాను కర్ణి సేన ప్రతినిధినని వీడియోలో పేర్కొన్నాడు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి విడతలో లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లాను కాంగ్రెస్ ఎంపీలు దుర్భాషలాడిన విధానంపై బీజేపీ, కర్ణిసేన కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారని అతడు అన్నాడు. ఇలాంటి సంఘటన మళ్లీ జరిగితే ఆ ఎంపీల ఇళ్లలోకి చొరబడి ధ్వంసం చేస్తామని, రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే ఈ ఘటన జరిగిందని ఆరోపిస్తూ, మళ్లీ ఇలాంటిదే జరిగితే నీ ఇంట్లోకి చొరబడి కాల్చేస్తాం అంటూ హెచ్చరించాడు. 24 గంటల్లో ఆ ఎంపీలను అరెస్ట్ చేయకపోతే ఒక్కొక్కరిని కాల్చేస్తామని కూడా వీడియోలో చెప్పాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి, బోర్కెడా పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ జరుపుతున్నారు. కోటా ఎస్పీ తేజస్వీని గౌతమ్ తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడిపై ఉధ్యోగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సంబంధిత సెక్షన్ల కింద చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఆమె తెలిపారు. బీజేపీ కోటా నగర అధ్యక్షుడు రాకేష్ జైన్, అలాగే శ్రీ రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు మహీపాల్ సింగ్ మక్రానా ఈ వ్యక్తికి తమ సంస్థలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రాణహానికర బెదిరింపులను తమ పార్టీ లేదా సంస్థ ఎప్పుడూ సమర్థించదని పేర్కొన్నారు. వీడియోలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ఓం బిర్లా చేతులు కలుపుతున్న ఫోటో నేపథ్యంలో కనిపించడాన్ని కూడా పోలీసులు గమనించారు.
‘ గాడ్సే ఫ్యాక్టరీ: రాహుల్‌కు బెదిరింపుల వీడియోపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, 25 మంది కాంగ్రెస్ ఎంపీలను కాల్చేస్తామని బెదిరిస్తూ తాను కర్ణి సేనకు చెందినవాడినని చెప్పుకున్న వ్యక్తి విడుదల చేసిన వీడియోపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆర్‌ఎస్‌ఎస్–బీజేపీ వ్యవస్థనే ‘గాడ్సే ఫ్యాక్టరీ’గా అభివర్ణించింది.
కాంగ్రెస్ మీడియా విభాగం అధిపతి పవన్ ఖేరా సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేస్తూ ‘ఇది యాదృచ్ఛిక వ్యాఖ్య కాదు, పన్నిన కుట్రలో భాగం అని అన్నారు. బీజేపీ ఎంపీలు రాహుల్ గాంధీని ‘దేశ భద్రతకు అతిపెద్ద ముప్పుగా పేర్కొంటూ ఒకే లైన్‌ను పునరావృతం చేస్తున్నారని విమర్శించారు.
ప్రెస్ సమావేశంలో కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనాథే కూడా బీజేపీపై మండిపడ్డారు. స్పీకర్‌కు మద్దతుదారుడినని చెప్పుకుంటున్న వ్యక్తి ఇలా బహిరంగంగా బెదిరిస్తే ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఈ విషయంలో ఎఫ్‌ఐఆర్ ఎందుకు నమోదు కాలేదని అడిగారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా సోషల్ మీడియాలో స్పందిస్తూ మోడీ భక్తులు బహిరంగంగా బెదిరింపులు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. బీజేపీ రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూపించే సంస్కృతి పెంచిందని అన్నారు. అయితే, రాహుల్ గాంధీ భయపడరని, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వారసత్వానికి చెందినవారని ‘డరో మత్’ నినాదంతో ముందుకు సాగుతారని ఆయన తెలిపారు.
