Let's talk: editor@tmv.in
రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనల వివరాలను వెల్లడించాలి: బీజేపీ నేత‌ సీఆర్ కేశవన్

రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనల వివరాలను వెల్లడించాలి: బీజేపీ నేత‌ సీఆర్ కేశవన్

Gaddamidi Naveen
16 జులై, 2026

కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్ బుధవారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలలో పారదర్శకత లోపించిందని ఆరోపిస్తూ, ఆయన తన విదేశీ పర్యటనల తాలూకు పూర్తి వివరాలను బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కేశవన్ స్పందిస్తూ.. తన సుదీర్ఘ విదేశీ యాత్రల నుంచి విరామం తీసుకున్న రాహుల్ గాంధీ, ఎట్టకేలకు భారతదేశాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఆయన విదేశీ పర్యటనల చుట్టూ అల్లుకున్న రహస్యాలు నిజంగా తీవ్ర ఆందోళన కలిగించే అంశం. రాహుల్ గాంధీ పారదర్శకతను, జవాబుదారీతనాన్ని తప్పించుకునే వ్యక్తి అని విమర్శించారు. రాహుల్ గాంధీ తన విదేశీ ప్రయాణాలపై దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు.

లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ రహస్య పర్యటనలపై పారదర్శకతను ఆశించే హక్కు దేశ ప్రజలకు, దేశానికి ఉందని కేసవన్ పేర్కొన్నారు. అసలు ఆయన ఏ దేశాలను సందర్శిస్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? ఆయన పర్యటనల అజెండా ఏమిటి? అనే ప్రశ్నలు దేశంలో తీవ్ర అనుమానాలకు తావిస్తున్నాయని ఆయ‌న అన్నారు.

గతంలో కొన్ని సందర్భాల్లో భారత్‌ను విమర్శించే వ్యక్తులు, సంస్థలతో రాహుల్ గాంధీ కలిసి కనిపించారని ఆరోపించారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న శక్తులతో ఆయన సంబంధాలు కొనసాగిస్తున్నారనే అనుమానాలు ఈ పర్యటనల వల్ల మరింత పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.‘భయపడొద్దు’ అంటూ తరచూ ప్రజలకు సందేశాలు ఇచ్చే రాహుల్ గాంధీ, తన విదేశీ పర్యటనల వివరాలను వెల్లడించడంలో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని కేశవన్ ప్రశ్నించారు. పర్యటనల్లో దాచాల్సిన అంశాలేమీ లేకపోతే వాటికి సంబంధించిన వివరాలను బహిరంగంగా వెల్లడించడంలో కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలపై పూర్తి పారదర్శకత పాటించాలని, ప్రజలకు సమగ్ర సమాచారం అందించాలని బీజేపీ తరఫున కేశవన్ డిమాండ్ చేశారు.

ట్యాగ్‌లు
RahulGandhiCongressBJPCRKesavanLokSabhaLeaderOfOppositionIndianPoliticsPoliticalNewsIndiaNewsBreakingNewsNationalPolitics
రాహుల్ గాంధీ తన విదేశీ పర్యటనల వివరాలను వెల్లడించాలి: బీజేపీ నేత‌ సీఆర్ కేశవన్ - Tholi Paluku