
రాహుల్ గాంధీ ఒక 'జోకర్': కేటీఆర్
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత వేటు పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్పీకర్ తీవ్రమైన ఒత్తిడికి లోనై ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లక్ష్యంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాహుల్ గాంధీ ఒక పెద్ద జోకర్. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన రాజ్యాంగ పరిరక్షకుడిగా తనను తాను చూపించుకుంటూ ఒకవైపు మాట్లాడుతున్నారని, మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేలా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ప్రజలకు బోధనలు చేసే రాహుల్ గాంధీ, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.
అనర్హత పిటిషన్లపై స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజలకు స్పష్టంగా కనిపిస్తోందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ టికెట్‌పై ఎంపీగా పోటీ చేసినప్పటికీ అతనిపై ఉన్న పిటిషన్‌ను స్పీకర్ తిరస్కరించారని విమర్శించారు. ఈ పరిణామాలను చూస్తే కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి స్పష్టమవుతుందని అన్నారు. పార్టీ ఫిరాయింపుల రాజకీయానికి కాంగ్రెస్ పార్టీనే నాంది పలికిందని కేటీఆర్ ఆరోపించారు. ఇందిరా గాంధీ కాలం నుంచే “ఆయా రామ్ గయా రామ్” అనే రాజకీయ సంస్కృతి ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తున్న చర్యలు రాజ్యాంగంపై దాడి చేసినట్లేనని వ్యాఖ్యానించారు. నేడు రాహుల్ గాంధీ అదే బాటలో నడుస్తూ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.
బుధవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై ఉన్న చివరి రెండు అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. ఈ నిర్ణయం వెలువడిన కొద్దిసేపటికే కేటీఆర్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
