Let's talk: editor@tmv.in
రాహుల్ గాంధీకి కవిత సూటి ప్రశ్న: రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?

రాహుల్ గాంధీకి కవిత సూటి ప్రశ్న: రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది?

Gaddamidi Naveen
3 మార్చి, 2026

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి సోమవారం ఆమె 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, దగా అనే పదాలకు నిలువుటద్దమని ఆమె ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీకి ఇప్పటికి రెండున్నర సంవత్సరాలు గడిచిపోయాయని గుర్తుచేశారు. రాహుల్ గాంధీ, రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వండి. కాంగ్రెస్ గెలిస్తే తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన మాటకు రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యాయి, అంటూ ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు.

తెలంగాణకు వస్తున్నప్పుడు నిరుద్యోగ యువతలో ఉన్న ఆవేదన మీకు వినిపించదా? అని రాహుల్ గాంధీని ఆమె ప్రశ్నించారు. పార్టీ అధికారంలోకి రావడానికి యువతే మెట్లు అయ్యారని, కానీ ఇప్పుడు ఉద్యోగాలు కోరితే వారిని పోలీస్ చర్యలతో అణచివేస్తున్నారని ఆరోపించారు. యూత్ డిక్లరేషన్ బోగస్‌గా మారింది. ఉద్యోగాల క్యాలెండర్ లేదు. కాంగ్రెస్ మోసం, ద్రోహం అనే పదాలకు అర్థం నిలబెట్టిందని ఆమె వ్యాఖ్యానించారు. ఇది పోరాటాలకు పుట్టిన గడ్డ. ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. రెండు లక్షల ఉద్యోగాల భర్తీని తక్షణమే అమలు చేయండి, అంటూ రాహుల్ గాంధీకి ఆమె సూచించారు.

తెలంగాణలో నిరుద్యోగం ప్రధాన సమస్యగా కొనసాగుతున్న నేపథ్యంలో ఈ విమర్శలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదే సమయంలో న్యూఢిల్లీ లోని సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ ఉన్నత నాయకత్వం సమావేశమై రాబోయే రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాజ్యసభ అభ్యర్థుల పేర్లు వచ్చే రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

రాహుల్ గాంధీకి కవిత సూటి ప్రశ్న: రెండు లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? - Tholi Paluku