
రాహుల్‌పై ప్రివిలేజ్ నోటీసు ఇస్తాం: కిరణ్ రిజిజు
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సభను తప్పుదోవ పట్టించారని, నిరాధార ఆరోపణలు చేశారని ఆరోపిస్తూ ఆయనపై ప్రివిలేజ్ నోటీసు దాఖలు చేస్తామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు. రాహుల్ గాంధీ ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీపై అసత్య, ఆధారరహిత ఆరోపణలు చేశారని ఆయన విమర్శించారు. లోక్‌సభ, రాజ్యసభల్లో స్పష్టమైన విధి విధానాలు ఉన్నాయి. ఒక సభ్యుడు మరొకరిపై తీవ్రమైన ఆరోపణలు చేయాలంటే ముందుగా నోటీసు ఇవ్వాలి, ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలి. కానీ రాహుల్ గాంధీ అలాంటి నిబంధనలు పాటించలేదని రిజిజు అన్నారు.
రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సభలో ధృవీకరించాల్సిందిగా పిలవాలని తాను కోరినట్లు తెలిపారు. ప్రధాని దేశాన్ని అమ్మేశారని ఆయన అన్నారు. దానికి ఆధారం ఏమిటి? హర్దీప్ సింగ్ పూరిపై ముందస్తు నోటీసు లేకుండా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇది ప్రివిలేజ్ ఉల్లంఘన అని పేర్కొన్నారు. బడ్జెట్ చర్చ సందర్భంగా ప్రసంగం ముగిసిన వెంటనే రాహుల్ గాంధీ సభను వీడటాన్ని రిజిజు తప్పుబట్టారు. సాధారణంగా అసత్యాలు, ఆరోపణలతో నిండిన ప్రసంగం చేసి వెంటనే బయటకు వెళ్లిపోతారు. మంత్రి సమాధానం వినడానికి ఆయన కూర్చోరు. ఇది ప్రతిపక్ష నేత స్థాయికి తగిన ప్రవర్తన కాదని వ్యాఖ్యానించారు. సభలో ఆయన చేసిన అసత్య ఆరోపణలను ఎదుర్కొంటాం. సభ వెలుపల కూడా ఆయన అబద్ధాలను ఖండిస్తాం. ఆయన తన వ్యాఖ్యలను ధృవీకరిస్తానని చెప్పారు, కానీ ఆయనకు అవి సాధ్యం కాదని నాకు తెలుసు. ఆయన సభను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.
దేశాన్ని ఎవరూ అమ్మలేరని, కొనలేరని తాను రాహుల్ గాంధీకి గుర్తుచేసినట్లు చెప్పారు. భారతదేశాన్ని కొనడం గానీ, అమ్మడం గానీ ఎవరూ ఊహించలేరని రిజిజు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ బడ్జెట్ చర్చలో ఉపయోగించిన అనుచిత పదాలను, నిరాధార వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కూడా ఆయన కోరారు. కాగా, బడ్జెట్‌పై జరిగిన చర్చలో రాహుల్ గాంధీ భారత్–అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ, దేశ భవిష్యత్తును ప్రభుత్వం ‘లొంగదీసుకుందని’ ఆరోపించిన విషయం తెలిసిందే.
ఎన్నికల పరాజయాలతో రాహుల్ కసితో ఉన్నారు: అనురాగ్ ఠాకూర్
లోక్‌సభలో బడ్జెట్ చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, బీజేపీ నాయకుడు అనురాగ్ ఠాకూర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. వరుస ఎన్నికల పరాజయాలు రాహుల్ గాంధీని కసితో నింపాయని, ఆయన దేశం, రాజ్యాంగ సంస్థలపై ద్వేషం పెంచుకున్నారని ఆరోపించారు. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందం ద్వారా ప్రభుత్వం దేశ ప్రయోజనాలను ‘అమ్మేసిందని’ రాహుల్ చేసిన ఆరోపణలకు ప్రతిస్పందిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు, ప్రధాని నరేంద్ర మోడీ దేశ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన ప్రధానమంత్రి అని, ఆయన నాయకత్వం అచంచలమైనదని పేర్కొన్నారు. చర్చలో పాల్గొన్న అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ 95 ఎన్నికల్లో ఓటమి పాలైందని, త్వరలోనే పరాజయాల శతకం పూర్తి చేస్తుందని అన్నారు. ఎన్నికల ఓటములు ఆయనను ద్వేషంతో నింపాయి. ఆయనకు పార్లమెంటరీ నియమాలపై ద్వేషం, స్పీకర్‌పై ద్వేషం, రాజ్యాంగ సంస్థలపై ద్వేషం, ప్రధానిపై ద్వేషం ఉంది. ఇప్పుడు దేశంపైనే ద్వేషం పెంచుకున్నారని విమర్శించారు. ఎంఎస్‌ఎంఈల విషయంలో రాహుల్ కన్నీళ్లు కారుస్తున్నారని ఠాకూర్ ఆరోపించారు. యూపీఏ హయాంలో చైనా ఉత్పత్తులకు స్వేచ్ఛనిచ్చి దేశీయ వ్యాపారులను దెబ్బతీశారని అన్నారు. కాంగ్రెస్ ఎంఎస్‌ఎంఈలను దిగజార్చింది, మోడీ వాటిని ప్రోత్సహించారని వ్యాఖ్యానించారు.
ఎల్జేపీ (ఆర్వీ) సభ్యుడు అరుణ్ భారతి బడ్జెట్‌ను స్వాగతిస్తూ, ఎన్‌డీఏ ప్రభుత్వ విధానాలతో బీహార్ అభివృద్ధి సాధిస్తున్నదని అన్నారు. ఒకప్పుడు ‘బిమారు’ రాష్ట్రంగా పరిగణించిన బీహార్ ఇప్పుడు నూతన భారత గర్వంగా ఎదుగుతోందని పేర్కొన్నారు. ఆప్ సభ్యుడు రాజ్‌కుమార్ చబ్బేవాల్ పంజాబ్‌కు కేంద్రం బకాయిలుగా ఉన్న రూ.12,205 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ సభ్యుడు సుధీర్ గుప్తా, మాజీ ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్లలో నిరాశ కనిపించేదని, నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశావహంగా ఉందని అన్నారు.
సిక్కిం క్రాంతికారి మోర్చా సభ్యుడు ఇంద్ర హాంగ్ సుబ్బా, ఈశాన్య రాష్ట్రాల్లో బౌద్ధ పర్యాటక వలయాన్ని అభివృద్ధి చేయాలన్న నిర్ణయాన్ని స్వాగతించారు. హిమాలయ రాష్ట్రాల్లో ట్రెక్కింగ్ మార్గాల అభివృద్ధికి సిక్కిం అనుభవాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్) సభ్యుడు చంద్రశేఖర్ దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్యగా ఉందని, ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ వర్గాల కోసం ఉపాధి పథకాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
