
రాహుల్‌గాంధీ తన ప్రవర్తనకు క్షమాపణ చెప్పాలి: మాజీ సైనికాధికారులు
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పార్లమెంట్ ప్రాంగణంలో ప్రదర్శన సందర్భంగా ప్రవర్తించిన తీరు దేశానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని 204 మంది రిటైర్డ్ సైనిక అధికారులు, మాజీ సివిల్ సర్వెంట్లు, దౌత్యవేత్తలు, న్యాయవాదులు కోరారు. ఇది పార్లమెంట్ మర్యాదలు, సంస్థాగత గౌరవానికి విరుద్ధమని వారు పేర్కొన్నారు. మార్చి 12న పార్లమెంట్ హౌస్ ప్రాంగణంలో జరిగిన నిరసన సమయంలో, సభాధ్యక్షుడు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలను విస్మరించడం ద్వారా గాంధీ నేతృత్వంలోని ప్రతిపక్షం పార్లమెంటరీ వ్యవస్థను అవమానించిందని ఓపెన్ లెటర్‌లో ఆరోపించారు. సభ ప్రాంగణంలో నిరసనలు, ప్రదర్శనలు నిషేధించినప్పటికీ వాటిని ఉద్దేశపూర్వకంగా పట్టించుకోలేదని విమర్శించారు. ఇలాంటి చర్యలు కేవలం విధి విధానాల ఉల్లంఘన మాత్రమే కాకుండా, పార్లమెంట్ అధికారాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని సూచిస్తాయి. వ్యక్తిగత రాజకీయ ప్రదర్శనల కోసం రాజ్యాంగ సంస్థ గౌరవాన్ని పణంగా పెట్టడం సరైంది కాదని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. గాంధీ తక్షణం దేశానికి క్షమాపణ చెప్పి, తన ప్రవర్తనపై ఆత్మపరిశీలన చేయాలని వారు సూచించారు. ఇటువంటి వ్యవహారం పార్లమెంట్ గౌరవాన్ని దెబ్బతీస్తుందని, ప్రజాస్వామ్య విలువలను తగ్గిస్తుందని తెలిపారు.
పార్లమెంట్ రాజకీయాలకు వేదికలు కావు
ప్రతిపక్ష ఎంపీలతో కలిసి గాంధీ పార్లమెంట్ మెట్లు వద్ద కూర్చొని టీ, బిస్కెట్లు తీసుకుంటూ నిరసన చేపట్టడం అత్యున్నత శాసనసభ సభ్యులకు తగిన ప్రవర్తన కాదని విమర్శించారు. పార్లమెంట్ మెట్లు రాజకీయ ప్రదర్శనలకు వేదిక కావు అని స్పష్టం చేశారు. పార్లమెంట్‌ను ప్రజాస్వామ్య ఆలయంగా అభివర్ణిస్తూ, దాని గౌరవం కేవలం సభా గదుల్లోనే కాకుండా కారిడార్లు, మెట్లు, లాబీల వంటి ప్రాంగణమంతటా పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇవి కూడా పార్లమెంట్‌లో భాగమే కాబట్టి సభ్యులు తమ ప్రవర్తనలో అదే గౌరవాన్ని పాటించాలన్నారు. ఈ లేఖను జమ్మూ కశ్మీర్ మాజీ డీజీపీ ఎస్‌పీ.వెయిడ్ సమన్వయం చేశారు. మొత్తం 204 మంది సంతకం చేసిన ఈ లేఖలో 116 మంది రిటైర్డ్ సైనిక అధికారులు, 84 మంది మాజీ బ్యూరోక్రాట్లు, నలుగురు మాజీ రాయబారులు, నలుగురు సీనియర్ అడ్వకేట్లు ఉన్నారు. పార్లమెంట్‌లో నిరసనలు, అంతరాయాలు ప్రజా సమయాన్ని వృథా చేస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచే విధంగా పార్లమెంట్ కార్యకలాపాలు దెబ్బతినకూడదని అన్నారు. ప్రతిపక్ష నేతగా గాంధీపై ఉన్న బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని, ఆయన ప్రవర్తన మరింత ఆందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య ఆశయాలకు ప్రతీకగా ఉన్న పార్లమెంట్ విశ్వసనీయతను కాపాడేందుకు బాధ్యతాయుతమైన ప్రవర్తన అవసరమని వారు సూచించారు.
