Let's talk: editor@tmv.in
రాహుల్‌గాంధీ ‘ఇండియన్ స్టేట్’ వ్యాఖ్యపై పిటిషన్‌.. తీర్పు రిజర్వ్

రాహుల్‌గాంధీ ‘ఇండియన్ స్టేట్’ వ్యాఖ్యపై పిటిషన్‌.. తీర్పు రిజర్వ్

Pinjari Chand
9 ఏప్రిల్, 2026

కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ చేసిన ‘ఇండియన్ స్టేట్‌తో కూడా మా పోరాటం’ అనే వ్యాఖ్యపై దాఖలైన పిటిషన్‌పై అలహబాద్‌ హైకోర్టు బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసును న్యాయమూర్తి విక్రమ్‌.డీ చౌహన్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ విచారించింది. ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాక కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసినట్లు తెలిపింది.

కేసు నేపథ్యం

2025 జనవరి 15న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఈ వివాదం మొదలైంది. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మా పోరాటం కేవలం బీజేపీ లేదా ఆర్‌ఎస్‌ఎస్‌తో మాత్రమే కాదు, ఇండియన్ స్టేట్‌తో కూడా జరుగుతోందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై సిమ్రాన్ గుప్తా అనే వ్యక్తి కేసు వేశారు. మొదట ఈ పిటిషన్‌ను సంభల్ జిల్లాలోని చందౌసీ కోర్టు 2025 నవంబర్ 7న కొట్టివేసింది. కేసు బలహీనంగా ఉందని పేర్కొంది. అయితే ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ పిటిషనర్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.

ముందస్తు విచారణలు

ఇందుకు ముందు 2025 మే 21న సంభల్ జిల్లా కోర్టు రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. కేసుకు సంబంధించిన ఫిర్యాదుపై స్పందించాలా లేక కోర్టుకు హాజరు కావాలా అని ఆదేశించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సచిన్ గోయల్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ప్రత్యేక ఎంపీ/ఎంఎల్‌ఏ కోర్టులో కేసు వేశామని తెలిపారు. అయితే ఆ కోర్టు పరిధి లేదని పేర్కొంటూ సీజేఎం కేసును రద్దు చేసిందన్నారు. దాంతో ఆ ఉత్తర్వును సవాల్ చేస్తూ రివిజన్ పిటిషన్ దాఖలు చేసినట్లు చెప్పారు.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

ఇందిరా భవన్ ప్రారంభోత్సవంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు దేశంలోని ప్రతి రాజ్యాంగ సంస్థను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అందుకే ఇప్పుడు మా పోరాటం కేవలం రాజకీయ పార్టీతో కాదు, ఇండియన్ స్టేట్‌తో కూడా జరుగుతోందని అన్నారు. దేశంలోని సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయా లేదా అన్నది స్పష్టంగా లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. మీడియా కూడా స్వేచ్ఛగా పనిచేయడం లేదని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై వచ్చిన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు త్వరలో తీర్పు వెలువరించనుంది.

రాహుల్‌గాంధీ ‘ఇండియన్ స్టేట్’ వ్యాఖ్యపై పిటిషన్‌.. తీర్పు రిజర్వ్ - Tholi Paluku