Let's talk: editor@tmv.in
రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో సత్తా చాటాలి: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ పిలుపు

రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో సత్తా చాటాలి: వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్ పిలుపు

Gaddamidi Naveen
17 ఫిబ్రవరి, 2026

వరంగల్ కమిషనరేట్ పోలీసులు రాష్ట్ర స్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరచాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, ఐపీఎస్ పిలుపునిచ్చారు. 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ డ్యూటీ మీట్ క్రీడలు నేటి నుంచి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రారంభమవుతున్న సందర్భంగా, వరంగల్ పోలీస్ కమిషనరేట్ తరఫున పాల్గొనే క్రీడాకారులకు ప్రత్యేకంగా ప్రోత్సాహ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా క్రీడా గ్రామంలో ఎగురవేయనున్న వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్రీడా పతకాన్ని సీపీ అధికారులు, క్రీడాకారులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనే పోలీస్ క్రీడాకారులకు ట్రాక్ సూట్లు, స్పోర్ట్స్ షూలు, టీ-షర్టులు సీపీ సన్ ప్రీత్ సింగ్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో వరంగల్ కమిషనరేట్ ప్రతిష్ఠను నిలబెట్టే విధంగా ప్రతి క్రీడాకారుడు ఉత్తమ ప్రదర్శన ఇవ్వాలని సూచించారు. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణలోనే కాదు, క్రీడారంగంలో కూడా రాణించగల సామర్థ్యం కలిగిన వారని పేర్కొన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి శాఖాపరమైన గుర్తింపు, ప్రోత్సాహం ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.