Let's talk: editor@tmv.in
రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్‌సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్‌సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Dantu Vijaya Lakshmi Prasanna
13 మార్చి, 2026

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. దీంతో పార్టీ కార్యాలయం జనసంద్రంగా మారింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుగా తన తండ్రి, కాంగ్రెస్ నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

పతాకావిష్కరణ అనంతరం భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు, నాయకులను ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ పార్టీ స్థాపన సమయంలో తాను ఒక్కడినే ఉన్నానని, కానీ ఇప్పుడు కోట్లాది మంది ప్రజల ఆశీర్వాదంతో వైసీపీ ఒక పెద్ద శక్తిగా ఎదిగిందని చెప్పారు. నల్లకాల్వలో ఇచ్చిన మాటే పార్టీ ఆవిర్భావానికి ప్రధాన కారణమైందని, ఆ ఒక్క మాట రాష్ట్ర రాజకీయాల దశ, దిశను మార్చిందని ఆయన పేర్కొన్నారు.

దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత, ఆయన మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శిస్తానని తాను నల్లకాల్వలో ఇచ్చిన మాటనే తర్వాత ఓదార్పు యాత్రగా ప్రారంభించామని జగన్ తెలిపారు. అయితే ఆ యాత్రకు అప్పటి కాంగ్రెస్ పార్టీ అడ్డుపడటంతో ఇచ్చిన మాట కోసం ఆ పార్టీని వీడి వైయస్సార్సీపీని స్థాపించాల్సి వచ్చిందని ఆయన గుర్తుచేశారు.

ఈ పార్టీ కొన్ని కోట్ల మంది ప్రజలది అని, అందరి ఆశలు ఆకాంక్షలకు ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. పార్టీ లోపల ఎప్పుడూ విలువలు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తామని తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ప్రజల ఆశయాల కోసం పార్టీ కట్టుబడి పనిచేస్తోందని జగన్ అన్నారు. తనపై ప్రేమాభిమానాలు చూపుతున్న కార్యకర్తలు, అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైయస్సార్ అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలు నినాదాలతో పార్టీ కార్యాలయ ప్రాంగణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ 16వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పలు జిల్లాల్లో నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహించారు.

శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని పరిగి మండల కేంద్రంలో మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించి, వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 15 ఏళ్లుగా అధికారం ఉన్నా, లేకున్నా ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తున్నామని, రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. పోలవరం, రాయలసీమ అభివృద్ధి కనిపించడం లేదని, పెట్టుబడులు ఒకే ప్రాంతానికి పరిమితమయ్యాయని ఆరోపించారు. అలాగే రాష్ట్రాన్ని భగవంతుడే కాపాడాలని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తిరుపతి లోని మారుతినగర్ క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇక ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్, సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు తదితరులు పార్టీ శ్రేణులతో కలిసి వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు.

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు, నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేటలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు బహుమాన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు.

అదే విధంగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం (కొండపల్లి మున్సిపాలిటీ)లో మాజీ మంత్రి జోగిరమేష్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.