
రాష్ట్ర విద్యా రంగం దేశానికి ఆదర్శంగా మారాలి: మంత్రి భట్టి
ఖమ్మం జిల్లా మధిర క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర విద్యా రంగంపై సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు మంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. తెలంగాణ రాష్ట్రం విద్యా రంగంలో దేశానికే ఆదర్శంగా నిలవాలన్న దృష్టితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఆ దిశగా ఆర్థిక శాఖతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని మంత్రి పేర్కొన్నారు.
అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌లు
గ్రామీణ యువత పోటీ పరీక్షల కోసం దూరప్రాంతాలకు వెళ్లి ఖర్చులు పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ సెంటర్లలో డిజిటల్ లైబ్రరీలు, నిపుణులచే ఆన్‌లైన్ కోచింగ్ సౌకర్యం, పోటీ పరీక్షలకు అవసరమైన పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో ఐదు ప్రదేశాల్లో ఈ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
యంగ్ ఇండియా స్కూళ్లు, బ్రేక్ ఫాస్ట్ పథకం
వచ్చే విద్యా సంవత్సరం నుంచే రాష్ట్ర విద్యా వ్యవస్థను గేమ్ చేంజర్‌గా మార్చే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. పిల్లల్లో పౌష్టికాహార లోపం నివారణకు, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉచిత బ్రేక్‌ఫాస్ట్ అందించే ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయని చెప్పారు.
విద్యా సంస్థల ఆధునికీకరణ
మారుతున్న పరిశ్రమల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా, పాలిటెక్నిక్ కళాశాలలను దశలవారీగా ఇంజనీరింగ్ కళాశాలలుగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి తెలిపారు. అదే విధంగా ప్రతి మండలంలో మూడు ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూళ్లుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన మౌలిక వసతులు, బోధనా సౌకర్యాలను పెంచుతున్నామని తెలిపారు. అదనంగా, ప్రతి పది గ్రామాలకు ఒక పాఠశాలను గుర్తించి అప్‌గ్రేడ్ చేసే చర్యలు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు.
ప్రభుత్వ ఇంటర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని స్థానిక సీఎస్ఆర్ నిధుల ద్వారా అందించేలా సూచనలు ఇచ్చినట్లు మంత్రి వెల్లడించారు. విద్యుత్ వినియోగంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలపై సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.విద్యా రంగం మార్పు ద్వారా తెలంగాణ భవిష్యత్తు బలపడుతుందని మంత్రి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి, కమిషనర్లు, ప్రాంతీయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
యంగ్ ఇండియా స్కూళ్లు – విద్యా రంగంలో కొత్త దిశ
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విద్యా వ్యవస్థను ఆధునీకరించాలన్న లక్ష్యంతో “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్” స్థాపనకు భారీ ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా పేద, గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆధునిక వసతులు అందించడం ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొంది.
మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 100–105 యంగ్ ఇండియా స్కూళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్కూల్ ఏర్పాటుకు ప్రణాళిక ఉంది.ఈ స్కూల్స్ నిర్మాణం, మౌలిక వసతుల అభివృద్ధి, బోధనా సిబ్బంది నియామకం వంటి కార్యక్రమాల కోసం మొత్తం రూ.20,000 నుంచి రూ. 21,000 కోట్లు ఖర్చు అంచనా వేయబడింది.
ముందుగా 20 స్కూల్స్‌కు రూ.4,000 కోట్లు, తరువాత 58 స్కూల్స్‌కు రూ.11,600 కోట్లు కేటాయిస్తూ దశలవారీగా ఈ ప్రాజెక్ట్‌ను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తోంది. ప్రతి స్కూల్‌లో సుమారు 2,500 మంది విద్యార్థులకు వసతి, ఆహారం, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, స్మార్ట్ ల్యాబ్‌లు వంటి ఆధునిక సదుపాయాలు కల్పించనున్నారు.
