Let's talk: editor@tmv.in
రాష్ట్ర ప్రయోజనాల కోసం పీఎం మోదీని ఎన్నిసార్లైనా కలుస్తా: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ప్రయోజనాల కోసం పీఎం మోదీని ఎన్నిసార్లైనా కలుస్తా: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
17 జనవరి, 2026

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీని ఎన్నిసార్లైనా కలవడానికి తాను వెనుకాడనని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నిర్మల్ జిల్లాలో జరిగిన ఒక ప్రజాసభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆదిలాబాద్ జిల్లాకు విమానాశ్రయం మంజూరు చేయాలని ప్రధాని మోదీని కోరనున్నట్లు సీఎం తెలిపారు. నేను ప్రధాని మోదీని ఎందుకు తరచూ కలుస్తానని కొందరు ప్రశ్నిస్తారు. ఆయన నా బంధువు కాదు, వ్యక్తిగత సంబంధాలు కూడా లేవు. కానీ ఆయన దేశ ప్రధాని. విమానాశ్రయం వంటి కీలక ప్రాజెక్టులు రావాలంటే ప్రధాని అనుమతి తప్పనిసరి. అలా అయితే పెద్ద పరిశ్రమలు వస్తాయి, కేంద్ర నిధులు లభిస్తాయని ఆయన అన్నారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవ్వరినైనా కలవడానికి తాను క్షణం కూడా ఆలోచించనని, తాను ఎలాంటి సిఫార్సులు లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రధాని వద్దకు వెళ్లడం లేదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనమే నా ఏకైక లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. గోదావరి నదిపై తుమ్మిడిహట్టి వద్ద సాగునీటి ప్రాజెక్టు నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ యోచనను కూడా సీఎం ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుకు పొరుగు రాష్ట్రం మహారాష్ట్ర సహకారం అవసరమని, ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మద్దతుతో మహారాష్ట్ర నుంచి అవసరమైన అనుమతులు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు

ఈ సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ తెలంగాణకు ఏమీ చేయలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కే. చంద్రశేఖర్ రావు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వలేకపోతే, ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని సూచించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేయగల సమర్థులైన అభ్యర్థులను ఎన్నుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 2034 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతుందని కూడా రేవంత్ రెడ్డి మరోసారి తెలిపారు.

ఆదిలాబాద్ అభివృద్ధికి భారీ ప్లాన్

తెలంగాణలో అత్యంత వెనుకబడిన జిల్లాగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన, దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తోందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని విద్య, పరిశ్రమలు, సాగునీరు, తాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు.

నిర్మల్ జిల్లాలో రూ. 386.46 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. తెలంగాణ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు రావలసినంత అభివృద్ధి, రావలసినంత నీరు గతంలో రాలేదు. పాలమూరు జిల్లాకు ఎలా ప్రాధాన్యతనిచ్చి అభివృద్ధి చేస్తున్నామో, అదే తరహాలో ఆదిలాబాద్‌ను కూడా అభివృద్ధి చేస్తాం అని భరోసా ఇచ్చారు.

నీటి పారుదల ప్రాజెక్టులు – నామకరణం

సాగునీటి రంగంలో కీలక నిర్ణయాలను ప్రకటిస్తూ, చనాక–కొరాటా బ్యారేజీకి మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి పేరు, సదర్మట్ బ్యారేజీకి స్వతంత్ర సమరయోధుడు, మాజీ మంత్రి పి. నర్సారెడ్డి పేరు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ విషయమై నీటి పారుదల శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పదేళ్ల పాటు పూర్తి చేయని చనాక–కొరాటా ప్రాజెక్టును ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి చేశామని సీఎం తెలిపారు.

విద్యా, పారిశ్రామిక రంగాలు

విద్యారంగానికి పెద్దపీట వేస్తూ, సరస్వతీ ఆలయమున్న బాసర ఐఐఐటీలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటు చేయాలనే చర్చల్లోనే కాలం గడిపితే ప్రారంభం కాదు. అందుకే బాసరలోనే వర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు.

పారిశ్రామిక అభివృద్ధిపై దృష్టిసారిస్తూ, ఆదిలాబాద్ జిల్లాలో అతిపెద్ద పారిశ్రామిక వాడను అభివృద్ధి చేసి దేశంలోని ప్రధాన పరిశ్రమలు ఇక్కడ స్థాపించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందుకోసం 10 వేల ఎకరాల భూమి సేకరణ అవసరమని వెల్లడించారు. అలాగే నిర్మల్‌లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు.

ఒకప్పుడు ఎర్రబస్సు కూడా సరిగా రాని పరిస్థితి నుంచి, రానున్న రోజుల్లో ఎయిర్ బస్సు (విమాన సేవలు) వచ్చేలా ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనుమతులు, నిధుల కోసం ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను ఎలా కలుస్తున్నామో, అదే విధంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు కూడా కలిసి పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు.

తుమ్మిడిహెట్టి వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును తప్పకుండా నిర్మిస్తామని సీఎం పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధమవుతోందని, మహారాష్ట్ర నుంచి అవసరమైన అనుమతుల కోసం కేంద్ర సహకారం తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎవరినైనా కలవడానికి మేము వెనుకాడం అని అన్నారు.

సాంస్కృతిక ప్రాధాన్యత

నాగోబా జాతర అభివృద్ధికి రూ. 22 కోట్లు తప్పకుండా మంజూరు చేస్తామని, మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయాన్ని కుంభమేళా స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఇప్పటికే దాదాపు రూ. 300 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. మేము పాలకులం కాదు, సేవకులం. భవిష్యత్ తరాల కోసం ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ఎంపీ నాగేశ్ గోదాం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.