Let's talk: editor@tmv.in
రాష్ట్ర పండుగగా మొల్ల జయంతి నిర్వహణ: మంత్రి సవిత

రాష్ట్ర పండుగగా మొల్ల జయంతి నిర్వహణ: మంత్రి సవిత

Dantu Vijaya Lakshmi Prasanna
12 మార్చి, 2026

తెలుగు సాహిత్యంలో తొలి కవయిత్రిగా గుర్తింపు పొందిన ఆతుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతిని ఈ నెల 13న రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత వెల్లడించారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని ఆమె బుధవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. తెలుగు భాషకు, సాహిత్యానికి మొల్ల చేసిన సేవలు విశేషమైనవని ఆమె కొనియాడారు.

మంత్రి సవిత మాట్లాడుతూ ఆతుకూరి మొల్ల తెలుగుజాతి గర్వించదగ్గ కవయిత్రి అని అన్నారు. నన్నయ్య ఆదికవి అయితే మొల్లను ఆది కవయిత్రిగా సాహిత్య లోకంలో గౌరవిస్తారని పేర్కొన్నారు. సంస్కృతంలో ఉన్న వాల్మీకి రామాయణాన్ని సులభమైన తెలుగు భాషలో ప్రజలకు అందించిన గొప్ప రచయిత్రి మొల్ల అని తెలిపారు. ఆమె రచించిన రామాయణం “మొల్ల రామాయణం”గా ప్రసిద్ధి చెందిందని వివరించారు.

మొల్ల కడప జిల్లా గోపవరం గ్రామానికి చెందినవారని మంత్రి తెలిపారు. 16వ శతాబ్దానికి చెందిన ఆమె సామాన్యమైన కుమ్మరి కుటుంబంలో జన్మించి, తన ప్రతిభతో తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచారని చెప్పారు. సాహిత్య రంగానికి ఆమె చేసిన సేవలు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని మంత్రి సవిత పేర్కొన్నారు.

ఈ నెల 13న మొల్ల జయంతి సందర్భంగా రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యక్రమాన్ని విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ మొల్ల జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నదని చెప్పారు. మొల్ల జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మంత్రి సవిత హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి సవితకు ఆహ్వానం

ఈ నెల 13న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి మొల్ల జయంతి కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్. సవితను రాష్ట్ర కుమ్మరి, శాలివాహన డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్ ఆహ్వానించారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆమెను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా కుమ్మరి, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్లు, కూటమి నాయకులు, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొల్ల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు.