Let's talk: editor@tmv.in
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆర్యవైశ్యులు కీలక భాగస్వాములు: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆర్యవైశ్యులు కీలక భాగస్వాములు: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
23 మార్చి, 2026

తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో, ఆర్థికాభివృద్ధిలో ఆర్యవైశ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆదివారం ఎల్‌బీ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవం'లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఆర్యవైశ్యుల చిరకాల కోరికను మన్నిస్తూ, వాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనికి సంబంధించి ప్రస్తుత శాసనసభ సమావేశాలు ముగిసేలోగానే అవసరమైన ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.

గిన్నిస్ బుక్ రికార్డు

ఈ ఉత్సవంలో భాగంగా నిర్వహించిన వాసవీ సామూహిక పారాయణం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకోవడం పట్ల సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యుల ఐక్యతకు, భక్తికి ఇది నిదర్శనమని ఆయన అభినందించారు.

తెలంగాణ సంస్కృతి, ఆర్థికాభివృద్ధిలో ఆర్యవైశ్యులు భాగస్వాములు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మీరు వెన్నెముక వంటి వారు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అహింసా మార్గంలో యుద్ధాన్ని గెలవొచ్చని చాటిన మహాత్మా గాంధీ ఈ జాతిలో పుట్టడం దేశానికే గర్వకారణమని కొనియాడారు. గాంధీజీ చూపిన శాంతియుత మార్గంలో నడుస్తూ, క్రమశిక్షణతో దేశాభివృద్ధికి ఆర్యవైశ్యులు తోడ్పడుతున్నారని ప్రశంసించారు. ఆర్యవైశ్య సామాజిక వర్గానికి తగిన గుర్తింపు, గౌరవం దక్కేలా చూస్తామని, వారి అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్, తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కల్వ సుజాత గుప్త, తదితరులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఆర్యవైశ్య ప్రతినిధులు ఈ మహోత్సవానికి తరలివచ్చారు.