Let's talk: editor@tmv.in
రాష్ట్ర ఆర్థిక పురోగతిలో బ్యాంకింగ్ రంగం కీలకం: డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్ర ఆర్థిక పురోగతిలో బ్యాంకింగ్ రంగం కీలకం: డిప్యూటీ సీఎం భట్టి

Gaddamidi Naveen
19 నవంబర్, 2025

రాష్ట్ర ఆర్థిక పురోగతిలో బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పోషిస్తుందని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమైన నూతన పాలసీలను రూపొందించడానికి, డిప్యూటీ సీఎం 47వ త్రైమాసిక స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.

డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న 2047 తెలంగాణ రైజింగ్ ఉత్సవాలు రాష్ట్ర భవిష్యత్తుకు కొత్త దిశ నిర్దేశం చేయనున్నాయని, ఈ వేడుకల్లో రాష్ట్ర పురోగతికి అవసరమైన కీలకమైన నూతన పాలసీలను ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు సమావేశం సందర్భంగా డిప్యూటీ సీఎం తెలిపారు. మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోడానికి 13 శాతం జీడీపీ వృద్ధితో ముందుకు సాగేందుకు రూపొందించిన 2047 రోడ్‌మ్యాప్‌‌‌ను ప్రకటించబోతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఉపాధి, సంపద పెరుగుదల లక్ష్యంగా బ్యాంకింగ్ రంగం మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆయ‌న‌ బ్యాంకర్లకు సూచించారు.

స్వయం సహాయక బృందాలకు అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాల విస్తరణను అత్యవసరంగా పెంచాల్సిన అవసరం ఉందని ఆయ‌న‌ పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు పంట కోత తరువాత మౌలిక వసతుల అభివృద్ధికి టర్మ్ లెండింగ్‌ను మరింతగా పెంచాలని బ్యాంకులకు ఆయ‌న‌ సూచనలు ఇచ్చారు.అలాగే రాష్ట్రంలో 13,000 కిలోమీటర్ల అంతర్గత రహదారుల నిర్మాణం వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో, మౌలిక వసతుల ఫైనాన్సింగ్‌లో బ్యాంకుల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని సమావేశం ప్రత్యేకంగా చర్చించిందని తెలిపారు. డిజిటల్ పేమెంట్లను విస్తృతంగా ప్రోత్సహించడంతో పాటు పీఎంజెడీవై పథకం, బీమా కవరేజ్ వంటి రంగాల్లో ఉన్న లోటులను వెంటనే భర్తీ చేసే చర్యలు తీసుకోవాలని సూచించబడిందన్నారు.

ఈ సమావేశం ద్వారా బ్యాంకింగ్ రంగం, ప్రభుత్వం పరస్పర సహకారంతో రాష్ట్ర ఆర్థిక పురోగతికి బలమైన పునాదులు వేయాలని నిర్ణయించుకుందని ఆయ‌న పేర్కొన్నారు.