Let's talk: editor@tmv.in
రాష్ట్ర అభివృద్ధికి నదుల అనుసంధానం కీలకం: సీఎం

రాష్ట్ర అభివృద్ధికి నదుల అనుసంధానం కీలకం: సీఎం

Panthagani Anusha
27 ఫిబ్రవరి, 2026

రాష్ట్రంలోని అన్ని నదులను అంతర్గతంగా అనుసంధానం (ఇంట్రా-లింకింగ్) చేయడం ద్వారా ఏపీని జలవనరుల భాండాగారంగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన విలువైన సూచనల మేరకు రాష్ట్రంలో ఈ బృహత్తర కార్యాచరణ కొనసాగుతోందని వెల్లడించారు. రాష్ట్రస్థాయిలో నదుల అనుసంధానం పూర్తయితే భవిష్యత్తులో జాతీయ స్థాయి నదుల అనుసంధాన ప్రక్రియ మరింత సులభతరం అవుతుందని ప్రధాని ఆకాంక్షించారని అదే స్ఫూర్తితో తాము ముందుకు సాగుతున్నామని సీఎం పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఉత్తరాన ఉన్న వంశధార నుంచి దక్షిణాదిలోని పెన్నా వరకు నదులన్నింటినీ అనుసంధానించడం ద్వారా నీటి ఎద్దటిని శాశ్వతంగా నివారించవచ్చని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ లక్ష్యం నెరవేరిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి పండుగ చేస్తూ ‘తెలుగు తల్లికి జలహారతి’ ఇస్తామని ఆయన సభకు హామీ ఇచ్చారు. కాగా నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకున్నప్పుడే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రతి ఎకరానికి సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు అందించడమే ప్రభుత్వ సంకల్పమని పునరుద్ఘాటించారు. కేవలం ప్రాజెక్టుల నిర్మాణం మాత్రమే కాకుండా ప్రతి ఇంటికి నల్లా ద్వారా స్వచ్ఛమైన నీటిని చేరవేయడమే నిజమైన అభివృద్ధిగా తాము భావిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.

సాగునీటి రంగానికి అగ్రతాంబూలం

పారుదల రంగానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను గణాంకాలతో సహా ముఖ్యమంత్రి వివరించారు. గత టీడీపీ పాలనలో (2014-2019) సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ. 68 వేల కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో అతి తక్కువ కాలంలోనే ఇప్పటికే రూ. 20 వేల కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. గోదావరి డెల్టా పితామహుడు సర్ ఆర్థర్ కాటన్ దార్శనికతను కొనియాడుతూ ఆయన నిర్మించిన ఆనకట్టల వల్ల నేడు లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయని అందుకే ప్రజలు నేటికీ ఆయన్ని స్మరించుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ గతంలో ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలోనే పట్టాలెక్కాయని కాంగ్రెస్ పాలనలో అవి తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని విమర్శించారు.

2027 నాటికి పోలవరం పూర్తి

ఇక పోలవరం ప్రాజెక్టును 2027 పుష్కరాల కంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ పనులను త్వరితగతిన పూర్తి చేసి జూలై నాటికి రైతులకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఉత్తరాంధ్రలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ. 2,000 కోట్లు కేటాయించామని వాటిని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని జలాశయాల్లో మొత్తం 1,300 టీఎంసీల సామర్థ్యానికి గాను 800 టీఎంసీల నీరు నిల్వ ఉందని అంటే సుమారు 60 శాతం నిల్వలు అందుబాటులో ఉన్నాయని సభకు వివరించారు. రానున్న కాలంలో వర్షపాతంపై ప్రతికూల అంచనాలు ఉన్నప్పటికీ రైతుల ప్రయోజనాల దృష్ట్యా మే15 నుంచే ముందస్తుగా సాగునీటిని విడుదల చేస్తామని ప్రకటించారు.

ఇక పక్క రాష్ట్రమైన తెలంగాణతో నీటి వివాదాల ప్రసక్తి లేకుండా ఉమ్మడి ప్రయోజనాలే ముఖ్యమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు లాభమే తప్ప ఎవరికీ నష్టం ఉండదని స్పష్టం చేశారు. తెలంగాణలోని కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని అదే విధంగా ఏపీ చేపట్టిన నల్లమల సాగర్ ప్రాజెక్టుకు కూడా పొరుగు రాష్ట్రం నుంచి సానుకూల సహకారం ఉండాలని కోరారు.