Let's talk: editor@tmv.in
రాష్ట్రాభివృద్ధికి మీడియా సహకరించాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

రాష్ట్రాభివృద్ధికి మీడియా సహకరించాలి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Panthagani Anusha
30 మార్చి, 2026

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో జర్నలిస్టులు భాగస్వాములు కావాలని నిర్మాణాత్మకమైన విశ్లేషణలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. శనివారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) 11వ ప్లీనరీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ గత ఐదేళ్ల అరాచక పాలనలో మీడియా తన గొంతును కోల్పోయిందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పత్రికా స్వేచ్ఛను పునరుద్ధరించామని స్పష్టం చేశారు.

విలువల పునరుద్ధరణ జరగాలి

కాగా ప్రస్తుత కాలంలో జర్నలిజం పోకడలు ఆందోళన కలిగిస్తున్నాయని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. "రాజకీయ పార్టీలకు సొంత మీడియా సంస్థలు ఉండటం ప్రజాస్వామ్యానికి సమాజానికి అత్యంత ప్రమాదకరం. అలవోకగా అబద్ధాలను వండి వార్చడం వ్యక్తిత్వ హననానికి పాల్పడటం మీడియా ధర్మం కాదు అని ఆయన హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని మీడియా సంస్థలు తనపై చేసిన దుష్ప్రచారాన్ని ఆయన గుర్తు చేశారు. వివేకానంద రెడ్డి మరణాన్ని తొలుత గుండెపోటుగా చిత్రీకరించి ఆ పై తనపై 'నారాసుర రక్తచరిత్ర' అంటూ తప్పుడు కథనాలు రాశారని దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో జరుగుతున్న విపరీత పోకడలను అరికట్టడంలో జర్నలిస్టులు చొరవ చూపాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

ప్రొగ్రెసివ్ జర్నలిజం అవసరం

"మాది మీడియా ఫ్రెండ్లీ ప్రభుత్వం. మేం కేవలం పాజిటివ్ వార్తలే రాయమని కోరడం లేదు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడే ప్రొగ్రెసివ్ వార్తలను అందించండి అని సీఎం కోరారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే 2019-24 మధ్య జరిగిన నష్టమే ఏపీకి ఎక్కువని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్ర భవిష్యత్తును నీరుగార్చారని, ప్రశ్నించిన మీడియాను అణచివేసేందుకు 'జీవో నంబర్ 2430' వంటి చీకటి జీవోలను తెచ్చారని విమర్శించారు. నేడు అసెంబ్లీలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ తీర్మానం చేశామని వచ్చే ఐదేళ్లలో అమరావతి అద్భుత నగరంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.

జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గతంలో తెలుగుదేశం హయాంలోనే మండల రిపోర్టర్లకు అక్రిడిటేషన్లు, వెల్ఫేర్ ఫండ్, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం జర్నలిస్టుల అక్రిడిటేషన్లను సగానికి తగ్గించిందని తమ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అక్రిడిటేషన్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. అమరావతి ఐజేయూ కార్యాలయానికి స్థలం కేటాయింపు అంశాన్ని సబ్ కమిటీకి అప్పగిస్తామని వెల్లడించారు.అదే విధంగా జర్నలిస్టులపై దాడులు జరిగితే జిల్లా ఎస్పీ స్థాయి అధికారి విచారించేలా నిబంధనలు అమలు చేస్తామని సీఎం స్పష్టం చేశారు.