Let's talk: editor@tmv.in
రాష్ట్రాభివృద్ధికి కేబినెట్ కీలక నిర్ణయాలు

రాష్ట్రాభివృద్ధికి కేబినెట్ కీలక నిర్ణయాలు

Panthagani Anusha
14 మార్చి, 2026

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని పరుగులు పెట్టించడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన 45వ క్యాబినెట్ సమావేశంలో పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ, నిరుద్యోగ యువతకు ఉపాధి పథకాలు, అమరావతి నిర్మాణ పనులకు భారీ నిధుల కేటాయింపు వంటి అంశాలకు ఆమోదం తెలిపినట్లు సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి తెలిపారు. ఈ మేరకు క్యాబినెట్ సమావేశం అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు.

పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మంత్రుల బృందం ఏర్పాటు

అంతర్జాతీయంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా రాష్ట్రంపై పడే ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం ఒక మంత్రుల బృందాన్ని నియమించింది. ఈ ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరలు పెరగడం లేదా గ్యాస్, డీజిల్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే తీసుకోవాల్సిన చర్యలను ఈ బృందం పర్యవేక్షిస్తుంది. ముఖ్యంగా ఆసుపత్రులు, విద్యా సంస్థలకు ఇంధన సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రాధాన్యత జాబితాను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

పారిశ్రామిక భూములకు 22-ఏ నుంచి విముక్తి

ఇక రాష్ట్రంలో పెట్టుబడులను వేగవంతం చేసేందుకు గతంలో ఏపీఐఐసీ కేటాయించిన సుమారు 75,000 ఎకరాల భూములకు ఉన్న సాంకేతిక ఇబ్బందులను తొలగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ భూములు ప్రస్తుతం నిషేధిత ఆస్తుల జాబితా (22-ఏ )లో ఉండటం వల్ల పారిశ్రామికవేత్తలు బ్యాంకుల నుంచి రుణాలు పొందలేకపోతున్నారు. కాగా దీనిని పరిష్కరిస్తూ, ఎటువంటి అభ్యంతరాలు లేని 66,157 ఎకరాల భూములను తక్షణమే నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనివల్ల రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతమై స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

యువతకు చేయూత: ఏపీ-సీఎంఈజీపీ పథకం

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఉన్న ఎంఎస్ఎంఈ పార్కుల్లో సొంతంగా పరిశ్రమలు స్థాపించాలనుకునే యువత కోసం ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్’ ( : ఏపీ-సీఎంఈజీపీ ) కు ఆమోదం తెలిపారు. రూ. 300 కోట్ల బడ్జెట్‌తో అమలు చేసే ఈ పథకం ద్వారా సుమారు 17,000 మందికి ఉపాధి లభించనుంది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, వికలాంగుల పారిశ్రామికవేత్తలకు ప్రాజెక్టు వ్యయంలో 25 నుంచి 35 శాతం వరకు మార్జిన్ మనీ సబ్సిడీని ప్రభుత్వం అందించనుంది.

అమరావతిలో సచివాలయ నిర్మాణానికి రూ. 2,316 కోట్లు

రాజధాని అమరావతిలో ఆగిపోయిన నిర్మాణ పనులకు ప్రభుత్వం పునరుజ్జీవం పోస్తోంది. సచివాలయ టవర్లు వివిధ శాఖల కార్యాలయాల భవనాలలో ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఏసీ, ఫైర్ సేఫ్టీ వంటి ఎంఈపీ పనుల కోసం రూ. 2,316.88 కోట్ల పరిపాలన అనుమతులను క్యాబినెట్ మంజూరు చేసింది. అదేవిధంగా అమరావతిలో తెలుగు భాషా వైభవాన్ని చాటేలా రూ. 119 కోట్లతో ఒక అత్యాధునిక 'తెలుగు కల్చరల్ సెంటర్' నిర్మించేందుకు కూడా ఆమోదం లభించింది.

పోలవరం సాగునీటి ప్రాజెక్టుల పునరుద్ధరణ

మరోవైపు రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు పనులను 2026 జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం కుడి కాలువ సొరంగ పనులలో అదనపు యంత్రాల సేకరణకు రూ. 48 కోట్లను కేటాయించారు. అదేవిదంగా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పోలవరం ఎడమ కాలువ పనుల పాత ఒప్పందాలను రద్దు చేసి రూ. 76.87 కోట్లతో కొత్తగా పనులు చేపట్టనున్నారు. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తాగునీటి ఎద్దడి నివారణకు రూ. 11,000 కోట్లకు పైగా నిధులతో వివిధ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు.

సామాజిక భద్రత, విద్యకు ప్రాధాన్యత

అదేవిధంగా పోలీసు శాఖలో 300 మంది హెడ్ కానిస్టేబుళ్లను అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్‌పెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మహిళా భద్రత కోసం 30 కొత్త 'సఖి నివాస్' హాస్టళ్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నారు. విద్యారంగంలో భాగంగా నూజివీడు, పలాస, నందిగామ ప్రాంతాల్లో కేంద్రీయ విద్యాలయాల స్థాపన కోసం కోట్లాది రూపాయల విలువైన భూములను ఉచితంగా కేటాయిస్తూ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రాభివృద్ధికి కేబినెట్ కీలక నిర్ణయాలు - Tholi Paluku