Let's talk: editor@tmv.in
రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యం: సీఎం

రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యం: సీఎం

Panthagani Anusha
3 ఫిబ్రవరి, 2026

రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడమే ధ్యేయంగా, ఆంధ్రప్రదేశ్‌ను ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తుమ్మిశి గ్రామంలో పర్యటించిన ఆయన, అక్కడ నిర్వహిస్తున్న విలేజ్ హెల్త్ క్లినిక్‌ను సందర్శించారు. ‘సంజీవని’ ప్రాజెక్టులో భాగంగా తయారైన ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను స్వయంగా పరిశీలించి గ్రామస్తులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో మరిన్ని కీలక మార్పులు రానున్నాయని బిల్ గేట్స్ స్వయంగా రాష్ట్రానికి రానున్నారని వెల్లడించారు.

72 లక్షల మందికి వైద్య పరీక్షలు – డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 72 లక్షల మందికి సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి వారి పూర్తి ఆరోగ్య వివరాలతో కూడిన ‘డిజిటల్ హెల్త్ ప్రొఫైల్స్’ రూపొందిస్తామని సీఎం ప్రకటించారు. కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ‘సంజీవని’ని ఇప్పటికే చిత్తూరు జిల్లాకు విస్తరించామని ఈ ఏడాది చివరికల్లా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. టీసీఎస్, బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన ‘డిజినెర్వ్’ సెంటర్ ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారం వేలిముద్రతో లభించేలా టెక్నాలజీని వాడుతున్నామని వివరించారు.

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా ‘ఏఐ డాక్టర్’ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తోందని చంద్రబాబు తెలిపారు. మొత్తం 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రతి ఒక్కరికీ ‘హెల్త్ స్కోరింగ్’ ఇస్తామన్నారు. ముఖ్యంగా డయాబెటిస్, బీపీ, అనీమియా, గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారిని గుర్తించి, వారికి నిపుణులైన వైద్యులతో చికిత్స అందించడమే కాకుండా, అవసరమైన మందులను నేరుగా అందజేస్తామని హామీ ఇచ్చారు.

బాధిత కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం

తుమ్మిశి గ్రామంలో పర్యటించిన సమయంలో అనీమియా ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళలతో సీఎం మాట్లాడి వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఇదే గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన ఓ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. టెక్నాలజీని, వైద్యంతో జోడించి పేదవాడికి కార్పొరేట్ స్థాయి చికిత్స అందించడమే ప్రభుత్వ అంతిమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దటమే లక్ష్యం: సీఎం - Tholi Paluku