Let's talk: editor@tmv.in
రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ డిజిటల్ హెల్త్ ప్రాజెక్ట్ ను అమలు చేయండి: సీఎం

రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ డిజిటల్ హెల్త్ ప్రాజెక్ట్ ను అమలు చేయండి: సీఎం

Panthagani Anusha
17 డిసెంబర్, 2025

చిత్తూరు జిల్లా కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న ‘సంజీవని’ డిజిటల్ హెల్త్ రికార్డుల ప్రాజెక్టును త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు.

సచివాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజారోగ్య వ్యవస్థల సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరి ఆరోగ్య రికార్డుల డిజిటలైజేషన్‌ను ఒక సంవత్సరంలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. కుప్పంలో విజయవంతంగా అమలవుతున్న పైలట్ ప్రాజెక్టును ఆధారంగా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నామని చెప్పారు.

సాంకేతికత ఆధారంగా నివారణాత్మక వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్న సీఎం, రాష్ట్రంలో అధికంగా కనిపించే 10 ప్రధాన వ్యాధులపై ప్రత్యేక దృష్టి సారించి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైద్య నిపుణులతో కూడిన 10 సభ్యుల నిపుణుల కమిటీ పాల్గొంది. త్వరలో ముంబైలో జరగనున్న గ్లోబల్ ఏఐ కన్వెన్షన్లో రాష్ట్రంలో అమలవుతున్న ఆధునిక వైద్య, ఆరోగ్య వ్యవస్థలను ప్రదర్శించాలని నిపుణుల బృందాన్ని ముఖ్యమంత్రి కోరారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ ప్రజారోగ్య పరిరక్షణలో పోషకాహార సరఫరా కీలక పాత్ర పోషిస్తుందని సమావేశంలో సూచించారు. అదేవిదంగా యునెయిడ్స్ వ్యవస్థాపక కార్యనిర్వాహక డైరెక్టర్ పీటర్ పియోట్, ప్రజారోగ్యాన్ని కేవలం వైద్య అంశంగానే కాకుండా సామాజిక, ఆర్థిక అంశాలతో అనుసంధానంగా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

బిల్ గేట్స్ ఫౌండేషన్ ఇండియా కంట్రీ డైరెక్టర్ అర్చన వ్యాస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రజారోగ్య కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేకంగా హెల్త్ సెక్రటేరియట్ ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.

నిపుణుల కమిటీతో ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహించి ప్రజారోగ్య కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని సీఎం సూచించారు. వైద్య నిపుణుల సూచనల ఆధారంగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అర్చనా వ్యాస్‌ను ఆయన ఆదేశించినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.

‘సంజీవని’ డిజిటల్ హెల్త్ ప్రాజెక్టు

సంజీవని’ డిజిటల్ హెల్త్ రికార్డుల ప్రాజెక్టు అనేది రాష్ట్ర ప్రజల ఆరోగ్య వ్యవస్థను ఆధునికీకరించేందుకు చేపట్టిన కీలక కార్యక్రమం. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలను—వైద్య పరీక్షలు, చికిత్స చరిత్ర, మందుల వివరాలు, ల్యాబ్ రిపోర్టులు, టీకాల సమాచారం తదితరాలను—డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు. ఈ డేటా ఒకే కేంద్రిత వ్యవస్థలో ఉండటంతో, ప్రజలు ఏ ప్రాంతంలో, ఏ ఆసుపత్రికి వెళ్లినా వారి ఆరోగ్య సమాచారం వైద్యులకు వెంటనే అందుబాటులో ఉంటుంది.

దీంతో చికిత్స ప్రక్రియ వేగవంతమవుతుంది, పరీక్షలు మళ్లీ మళ్లీ చేయాల్సిన అవసరం తగ్గుతుంది, అనవసర ఖర్చులు కూడా ఆదా అవుతాయి. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో రోగి పూర్తి వైద్య చరిత్ర వెంటనే తెలిసేలా ఉండటం వల్ల ప్రాణాపాయం తగ్గుతుంది.

ఈ ప్రాజెక్టు సాంకేతికతను ఉపయోగించి నివారణాత్మక వైద్యానికి ప్రాధాన్యం ఇస్తుంది. డిజిటల్ డేటా విశ్లేషణ ద్వారా వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం, ప్రమాదకర వ్యాధులపై ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం, నిరంతర ఆరోగ్య పర్యవేక్షణ చేయడం సాధ్యమవుతుంది. దీని వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురికాకముందే తగిన చికిత్స పొందే అవకాశం కలుగుతుంది.

అదేవిదంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజారోగ్య ధోరణులను గుర్తించి వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునే వీలు కలుగుతుంది. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా నాణ్యమైన వైద్య సేవలు సమానంగా అందుబాటులోకి రావడం ఈ ప్రాజెక్టు ప్రధాన ప్రయోజనం.

మొత్తంగా, ‘సంజీవని’ డిజిటల్ హెల్త్ రికార్డుల ప్రాజెక్టు ప్రజల ఆరోగ్య భద్రతను బలోపేతం చేసి, సమర్థవంతమైన, పారదర్శకమైన, భవిష్యత్‌ దృష్టితో కూడిన ప్రజారోగ్య వ్యవస్థ నిర్మాణానికి దోహదపడనుంది.

రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ డిజిటల్ హెల్త్ ప్రాజెక్ట్ ను అమలు చేయండి: సీఎం - Tholi Paluku