
రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళల హెల్త్ ప్రొఫైలింగ్ ప్రారంభం
మహిళలకు అవకాశాలు కల్పిస్తే వారు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తారని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. మహిళలు ఎదిగితే కుటుంబం, సమాజం, దేశం కూడా అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం బంజారాహిల్స్‌లోని ఆదివాసీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి సీతక్కతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డ్వాక్రా మహిళల హెల్త్ ప్రొఫైలింగ్ కార్యక్రమాన్ని మంత్రులు ప్రారంభించారు. అలాగే మహిళల ఆరోగ్య అవగాహన కోసం ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్, ఫీడింగ్ కియోస్క్ స్టాళ్లను ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన మహిళలు, బాలికలతో మంత్రులు ఆత్మీయంగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం మహిళల ఆరోగ్య పరీక్షలు, క్యాన్సర్ నివారణ టీకాలపై రూపొందించిన షార్ట్ వీడియోలను ప్రదర్శించారు.
ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాల్లో నివసించే మహిళలకు భద్రతతో కూడిన వసతి కల్పించేందుకు రూపొందించిన వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఆన్‌లైన్ బుకింగ్ పోర్టల్‌ను మంత్రులు ఆవిష్కరించారు. సెర్ప్ సంస్థ గత ఏడాది సాధించిన విజయాలను ప్రతిబింబించే బుక్‌లెట్‌ను కూడా విడుదల చేశారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా సంఘాల సభ్యులను ఈ సందర్భంగా సన్మానించారు.
మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమం ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు అందిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ వంటి పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు రికార్డు స్థాయిలో రుణాలు మంజూరు చేయడంతో పాటు సుమారు రూ.1,200 కోట్ల వడ్డీ రాయితీని అందించినట్లు వెల్లడించారు.
హెల్త్ ప్రొఫైలింగ్ - 46 లక్షల మందికి లబ్ధి
మహిళల ఆరోగ్య రక్షణ కోసం రాష్ట్రంలోని 32 జిల్లాల్లో ఉన్న 4.37 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని దాదాపు 46 లక్షల మంది మహిళలకు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. బీపీ, షుగర్, థైరాయిడ్ సహా 30 రకాల పరీక్షలు చేసి ప్రతి మహిళకు క్యూఆర్ కోడ్‌తో డిజిటల్ హెల్త్ రికార్డు రూపొందించి ఈ-హెచ్ఎంఐఎస్ పోర్టల్‌లో భద్రపరుస్తామని మంత్రి చెప్పారు.దీనివల్ల భవిష్యత్తులో వారికి మెరుగైన చికిత్స అందించడం సులభతరమవుతుందన్నారు.
మహిళల్లో అధికంగా కనిపిస్తున్న సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం రాష్ట్రవ్యాప్తంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని మంత్రి ప్రకటించారు. 14 ఏళ్లు నిండిన సుమారు నాలుగు లక్షల మంది బాలికలకు బయట మార్కెట్లో రూ. 4 వేల వరకు విలువ చేసే గార్డాసిల్-4 టీకాను ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా అందిస్తామని తెలిపారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
