
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మూడో విడత 'మెగా పేరెంట్-టీచర్ మీటింగ్'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో శుక్రవారం జరిగిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ 3.0 (మెగా పీటీఎం) కార్యక్రమం విద్యావ్యవస్థలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. కోటికి పైగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉల్లాసంగా పాల్గొని, తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కలిసి అడుగులు వేశారు.
అభివృద్ధికి ఆత్మీయ చర్చ
ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం కేవలం మార్కుల పట్టికను చూడటం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థి సమగ్ర అభివృద్ధి, వ్యక్తిగత ప్రగతిపై లోతైన చర్చ జరిగింది.అంతేకాక తమ పిల్లల అభ్యాస సామర్థ్యాలు, నైపుణ్యాల స్థాయి, ప్రవర్తన హాజరు వంటి అంశాలపై ఉపాధ్యాయులు ప్రత్యేకించి తల్లిదండ్రులకు నివేదికలను అందించారు.
100 రోజుల ప్రణాళిక
ఇటీవల నిర్వహించిన బేస్ లైన్ టెస్ట్ ఫలితాల ఆధారంగా రూపొందించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను ఉపాధ్యాయులు సులభంగా అర్థమయ్యే భాషలో తల్లిదండ్రులకు వివరించిన ఉపాధ్యాయులు ఇంటి వద్ద తమ పిల్లలు చదువుకునేటప్పుడు ఎలా వ్యవహరించాలో దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా అనేక చోట్ల ఉపాధ్యాయులు తాము ఉపయోగించే లెర్నింగ్ టూల్స్, జాదుయి పిటారా కిట్‌లు, టాబ్లెట్‌ల ద్వారా పఠన సామర్థ్యాన్ని ఎలా మెరుగుపరుస్తున్నారో ప్రదర్శించి చూపించారు.
పాఠశాలల్లో పండుగ వాతావరణం
ఈ కార్యక్రమం ఒక సాధారణ సమావేశంలా కాకుండా పాఠశాలలన్నీ అలంకరణలతో పండుగ వాతావరణాన్ని తలపించాయి. విద్యార్థులు సొంతంగా తయారుచేసిన ఆహ్వాన పత్రికలతో తల్లిదండ్రులను ఆహ్వానించారు.
ప్రగతి ప్రదర్శన
విద్యార్థులు ఏడాది పొడవున చేసిన ప్రాజెక్ట్‌లు ఇతర సృజనాత్మక పనులను పోర్ట్‌ఫోలియో రూపంలో ప్రదర్శించారు.మన బడి నాడు-నేడు కార్యక్రమం ద్వారా మెరుగుపడిన తరగతి గదులు, ఇతర మౌలిక వసతులను తల్లిదండ్రులకు చూపించారు.
భామినిలోని ఏపీ మోడల్ స్కూల్ వేదికగా కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా పాల్గన్న సీఎం చంద్రబాబు విద్యార్థులు, టీచర్లు, విద్యా విధానంపై అనేక కీలక సందేశాలు ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగిస్తూ పిల్లలు భూమిలో పాతిపెట్టిన మాణిక్యాలు… సరైన గైడెన్స్ ఉంటే అద్భుతాలు చేస్తారు” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో వ్యక్తిగతంగా చర్చిస్తున్న సమయంలో వారి మొబైల్ ఫోన్లలో 'లీప్' యాప్‌ను ఇన్‌స్టాల్ చేయించడం ఒక ముఖ్యమైన అడుగు. ఈ యాప్‌లో పిల్లల భద్రతకు సంబంధించిన 'గుడ్ టచ్', 'బ్యాడ్ టచ్' వంటి అంశాలపై స్పష్టమైన అవగాహన కల్పించే వీడియోలు ఉన్నాయి. అలాగే, పిల్లలను సానుకూలంగా పెంచడానికి అవసరమైన 'పాజిటివ్ పేరెంటింగ్' పద్ధతులపై కూడా సమాచారం అందిస్తారు. 'నిపుణ్ ఆంధ్ర' కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యాలను తెలిపే పాట, పిల్లలు భాష, గణితం వంటి ప్రాథమిక సబ్జెక్టులలో సాధించాల్సిన కనీస సామర్థ్యాలకు సంబంధించిన వీడియోలు కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోలు తల్లిదండ్రులకు తమ పిల్లల విద్యా పురోగతిని అర్థం చేసుకోవడానికి, వారికి ఇంట్లో ఎలా సహాయం చేయాలో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ విధంగా, సాంకేతికతను ఉపయోగించుకొని తల్లిదండ్రులకు విద్యాపరమైన, భద్రతాపరమైన అవగాహన కల్పించడం జరిగింది.
ఈ మెగా పీటీఎం ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల మధ్య బంధం మరింత బలపడింది. పిల్లలు నిర్వహించిన మాక్ అసెంబ్లీకి, వారిలోని జ్ఞానానికి ప్రశంసలు కురిపించారు సీఎం. అదేవిదంగా ఉన్నత, విదేశీ విద్య కలల కోసం ‘కలలకు రెక్కలు’ పేరిట కొత్త పథకం ప్రారంభిస్తామని, విదేశీ చదువులకు పావలా వడ్డీకి రుణాలు ఇవ్వనున్నామని వెల్లడించారు. ఈ పథకం ద్వారా విద్యార్థులు తాము విదేశాలలో చదుకోవాలనే ఆలోచనను,కలలను చంపుకోవాల్సిన అవసరం లేదు” అని విద్యార్థులను ప్రోత్సహించారు.
శనివారాలను బ్యాగ్ డేగా ప్రకటించి ఆడుతూ పాడుతూ నేర్చుకునే విధానం తీసుకొచ్చామని 24 గంటలు చదవమని ఒత్తిడి చేస్తే చదువు రాదని, ఆసక్తితో తక్కువ సమయమే చదివినా విద్యార్థులు రాణిస్తారని చెప్పారు. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక సహాయం, ప్రతిభావంతులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు అందిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పల్నాడు జిల్లాలో జరిగిన పీటీఎంలో పాల్గొన్నారు.
