
రాష్ట్రవ్యాప్తంగా ‘ఐ కేర్ క్లినిక్’లు ప్రారంభం కానున్నాయి: మంత్రి దామోదర్
రాష్ట్ర ప్రజలకు కంటి వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ‘ఐ కేర్ క్లినిక్స్’ ఏర్పాటు చేయబోతున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు. శాసనమండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, విజయవంతంగా అమలవుతున్న డే కేర్ క్యాన్సర్ సెంటర్ల నమూనాలోనే ఈ ఐ కేర్ క్లినిక్స్‌ను అభివృద్ధి చేస్తూ, ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. గత రెండు సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో 6.12 లక్షల కాటరాక్ట్ శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించగా, 33.65 లక్షల మంది పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు చేపట్టినట్లు మంత్రి వివరించారు. ఈ గణాంకాలే రాష్ట్ర ప్రభుత్వం కంటి ఆరోగ్యంపై ఎంత ప్రాధాన్యం ఇస్తుందో స్పష్టంగా చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం విధాన రూపకల్పనతో పాటు, ఉన్నత స్థాయి సాంకేతిక నిపుణుల కమిటీ మార్గదర్శకత్వంలో అమలవుతోందని. ప్రజలకు శాస్త్రీయంగా నమ్మదగిన, దీర్ఘకాలికంగా నిలకడైన, సమగ్ర కంటి వైద్య సేవలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు ప్రతి పౌరుడికి నాణ్యమైన కంటి వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించిందని ఆయన అన్నారు. ముందస్తు పరీక్షలు, సమయానికి చికిత్స, అవసరమైన శస్త్రచికిత్సలు అందించడం ద్వారా కంటి సమస్యల వల్ల కలిగే అంధత్వాన్ని తగ్గించడంలో ఈ ఐ కేర్ క్లినిక్స్ కీలక పాత్ర పోషిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యంలో, ముఖ్యంగా కంటి ఆరోగ్య పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు.
