
రాష్ట్రవ్యాప్తంగా “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత ప్రచారం
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు, ప్రజల్లో ట్రాఫిక్ భద్రత పై అవగాహన పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఇందుకు అనుగుణంగా “అరైవ్ అలైవ్” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ నెలలో 15 రోజులు పాటు ప్రత్యేక అవగాహన సదస్సులు, రోడ్డు ప్రచారాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర డీజీపీ బీ. శివాధర్ రెడ్డి శనివారం ఒక సమావేశంలో పాల్గొని ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సమావేశానికి సీనియర్ పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రహదారి భద్రతా నిపుణులు హాజరయ్యారు.
హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రహదారి భద్రతపై ప్రజల్లో స్పష్టమైన అవగాహన కల్పించడం, ట్రాఫిక్ నియమాలను పాటించే అలవాటు పెంపొందించడం, సురక్షితమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహించడం ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని అని తెలిపారు.
ప్రజల భాగస్వామ్యం కీలకం
ఈ కార్యక్రమాన్ని సమష్టియత్నంగా మార్చేందుకు వివిధ శాఖలు, సంస్థలు సైతం ముందుకు రావాలని డీజీపీ పిలుపునిచ్చారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో అమలైన ఉత్తమ పద్దతులను పరిశీలించి, అత్యుత్తమ పద్దతులను సేకరించి రాష్ట్రంలో అమలు చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అందుకు ప్రజల భాగస్వామ్యం కీలకం అని ఆయన తెలిపారు .
అదనంగా సమావేశంలో పాల్గొన్న స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పలు సూచనలు చేశాయి:
• శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పొందే ముందు డ్రైవింగ్ శిక్షణ తప్పనిసరి చేయాలి
• శిక్షణ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ ఇవ్వాలి
• పాఠశాలల్లో రహదారి భద్రతకు ప్రత్యేక పాఠాలు ప్రవేశపెట్టాలి
• పెద్ద నగరాలు, పట్టణాల్లో రోడ్డు భద్రతా పార్కులు ఏర్పాటు చేయాలి
ఈ పార్కుల ద్వారా ప్రజలకు సురక్షిత డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాలు వ్యావహారిక రీతిలో నేర్పవచ్చని ఎన్జీఓలు ఆశాభావం వ్యక్తం చేసాయి. అదేవిదంగా “సేఫ్టీ కనెక్ట్” అనే కృత్రిమ మేధస్సు ఆధారిత మొబైల్ యాప్‌ను వాహనదారులందరికీ అందుబాటులోకి తేవాలని సూచించారు. ఈ యాప్ ద్వారా డ్రైవింగ్ ప్రవర్తనను పర్యవేక్షించి, భద్రతాపరమైన సూచనలు అందిస్తుందని వారు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న ఈ ప్రచారం ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గి, ప్రజల ప్రాణాలకు రక్షణ లభిస్తుందని అధికారులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
