
రాష్ట్రపతి ముర్మును కలిసిన ఐపీఎస్ శిక్షణార్థులు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సోమవారం రాష్ట్రపతి భవన్ లో ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) శిక్షణార్థులు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ పోలీసు అధికారులకు చట్టాలు, వ్యవస్థల ద్వారా అధికారం లభించినా, నిజమైన శక్తి వ్యక్తిగతంగా, వృత్తి పరమైన నిబద్ధత నుంచే వస్తుంది అని అన్నారు. యువ అధికారుల నేతృత్వంలో ‘భవిష్యత్‌కు సిద్ధమైన పోలీస్ బలగం’ వికసిత భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని చెప్పారు. రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించిన వివరాల ప్రకారం 77వ రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ బ్యాచ్ (2024 బ్యాచ్) కు చెందిన ఐపీఎస్ శిక్షణార్థులు రాష్ట్రపతిని కలిసి మాట్లాడారు. ఏ రాష్ట్రం లేదా ప్రాంతంలోనైనా పెట్టుబడులు రావాలంటే, చట్టం-న్యాయం కీలకం. ఆర్థిక ప్రోత్సాహకాలు ఎంత ముఖ్యమో, సమర్థవంతమైన పోలీసింగ్ కూడా అంతే అవసరం అని అన్నారు. పోలీసింగ్ ప్రపంచాన్ని టెక్నాలజీ విపరీతంగా మార్చేస్తోంది. పది సంవత్సరాల క్రితం ‘డిజిటల్ అరెస్ట్’ అనే పదం ఎవరికీ అర్థం తెలీదు. కానీ ఇప్పుడు అది పౌరులకు అత్యంత భయంకరమైన ముప్పుగా మారింది అని ఆమె చెప్పారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ వినియోగదారుల్లో ఒకటని, దీనికి అనుగుణంగా పోలీస్ వ్యవస్థ కూడా సాంకేతిక పరిజ్ఞానం పట్ల మరింత చురుకుగా ఉండాలని సూచించారు. దుష్ట ప్రయోజనాల కోసం టెక్నాలజీని ఉపయోగించే వారికంటే పోలీసులు కొన్ని అడుగులు ముందుండాలి అని ముర్ము సూచించారు. ఈ సారి 174 మంది శిక్షణార్థుల్లో 62 మంది మహిళా అధికారులు ఉండడం గర్వకారణమని రాష్ట్రపతి అన్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న బ్యాచ్‌లలో అత్యధిక మహిళా ప్రాతినిధ్యం అని ఆమె తెలిపింది.
అలాగే రాష్ట్రపతి ముర్ము భారత మాజీ రాష్ట్రపతి కె.ఆర్. నారాయణన్ జయంతి సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా లు రాష్ట్రపతిని రాష్ట్రపతి భవన్ లో కలిశారు. రాష్ట్రపతి యశోద మెడిసిటీ ఆసుపత్రిని ఇందిరాపురం, ఘాజియాబాద్ (ఉత్తరప్రదేశ్) లో ప్రారంభించారు.
ఆ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఆరోగ్యరంగం దేశ నిర్మాణంలో కీలక భాగమని, ప్రజల ఆరోగ్యం కాపాడడం ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య, వైద్య మౌలిక వసతులు, సంస్థలు, సేవలు నిరంతరం విస్తరిస్తున్నాయి. ఈ ప్రయత్నాలన్నీ ఆరోగ్యవంతమైన, అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి తోడ్పడతాయి అని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు.రాష్ట్రపతి ముర్ము, కరోనా మహమ్మారి సమయంలో యశోద ఆసుపత్రి చేసిన సేవలను ప్రశంసించారు. జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం వంటి జాతీయ ప్రాధాన్యతల పట్ల ఆసుపత్రి చూపుతున్న నిబద్ధతను మెచ్చుకున్నారు. అలాగే సికిల్ సెల్ అనీమియా నిర్మూలన వంటి జాతీయ ప్రచారాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
