
రాష్ట్రపతి పర్యటన ప్రోటోకాల్ వివాదం పై వివరణ ఇవ్వండి: కేంద్రం
పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పాల్గోన్న కార్యక్రమంలో ప్రోటోకాల్ లోపాలు చోటుచేసుకున్నాయనే వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఆదివారం సాయంత్రం 5 గంటలలోపు సమాధానం ఇవ్వాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్య కార్యదర్శికి కేంద్ర హోం కార్యదర్శి పంపిన లేఖలో, రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ప్రోటోకాల్, కార్యక్రమ స్థలం, రూట్ ఏర్పాట్లకు సంబంధించిన ‘బ్లూ బుక్’ నిబంధనలు ఎందుకు ఉల్లంఘించారో వివరించాలని కోరారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, వారి కుటుంబ సభ్యుల భద్రత, ప్రోటోకాల్‌కు సంబంధించిన నియమాలు ఈ గోప్యత పత్రంలో ఉంటాయి.
అసలేం జరిగింది?
శనివారం సిలిగురి సమీపంలోని బాగ్డోగ్రా విమానాశ్రయం వద్ద జరిగిన ఆదివాసీ సంఘం వార్షిక కార్యక్రమానికి రాష్ట్రపతి ముర్ము హాజరయ్యారు. అయితే కార్యక్రమానికి హాజరైన ప్రజల సంఖ్య చాలా తక్కువగా ఉండటంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదట ఈ కార్యక్రమం సిలిగురిలోని బిధన్నగర్‌లో జరగాల్సి ఉండగా, భద్రతా కారణాలు, ఇతర పరిపాలనా అంశాల కారణంగా గోషైపూర్‌కు మార్చినట్లు అధికారులు తెలిపారు. అయితే రాష్ట్రపతి రాష్ట్రానికి చేరుకున్న సమయంలో ముఖ్యమంత్రి, ముఖ్య కార్యదర్శి, డీజీపీ హాజరుకాలేదని కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి. సాధారణంగా రాష్ట్రపతి పర్యటనలో ముఖ్యమంత్రి లేదా కనీసం ఒక మంత్రి స్వాగతానికి హాజరుకావడం ప్రోటోకాల్ ప్రకారం అవసరం. కానీ ఆ రోజు విమానాశ్రయంలో సిలిగురి మేయర్ గౌతమ్ దేవ్ మాత్రమే రాష్ట్రపతిని స్వాగతించారని కేంద్రం పేర్కొంది. ఇదే కాకుండా రాష్ట్రపతి కోసం ఏర్పాటు చేసిన వాష్‌రూమ్‌లో నీరు లేకపోవడం, రాష్ట్రపతి ప్రయాణించిన మార్గంలో చెత్త కనిపించడం వంటి అంశాలపై కూడా కేంద్రం వివరణ కోరింది. ఈ ఘటనకు సంబంధించి డార్జిలింగ్ జిల్లా కలెక్టర్, సిలిగురి పోలీస్ కమిషనర్, అదనపు జిల్లా కలెక్టర్‌పై ఏమైనా చర్యలు తీసుకున్నారా అనే విషయాన్ని కూడా కేంద్రం తెలుసుకోవాలనుకుంది.
మమతా నాకు చెల్లెలిలాంటివారు
కార్యక్రమంలో మాట్లాడిన రాష్ట్రపతి ముర్ము, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గైర్హాజరుపై వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ నాకు చెల్లెలిలాంటివారు. నేను కూడా బెంగాల్ కూతురినే. ఆమె ఎందుకు రాలేదో తెలియదు. అయినా అది పెద్ద విషయం కాదు. మీరు అందరూ క్షేమంగా ఉండాలని అన్నారు. కార్యక్రమాన్ని బిధన్నగర్‌లో నిర్వహించి ఉంటే ఎక్కువ మంది పాల్గొనే అవకాశం ఉండేదని ఆమె పేర్కొన్నారు. అయితే కార్యక్రమాన్ని ప్రజలు సులభంగా చేరుకోలేని ప్రదేశానికి మార్చారని కూడా వ్యాఖ్యానించారు.
ఈ ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవికి తగిన గౌరవం ఇవ్వకపోవడం అవమానకరమని, ఇది ఎన్నడూ లేని విధమైన ఘటన అని అన్నారు. ఈ విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మజీ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవికి గౌరవం కాపాడాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. మరోవైపు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి కూడా స్పందిస్తూ, రాజ్యాంగ పదవులకు అందరూ గౌరవం ఇవ్వాలని, వాటిని రాజకీయ వివాదాలకు దూరంగా ఉంచాలని సూచించారు.
