
రాష్ట్రం జంగిల్ రాజ్‌లా మారింది: వైయస్ జగన్
రాష్ట్రం మొత్తం ఒక ఆటవిక రాజ్యం (జంగిల్ రాజ్)గా మారిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విచ్చలవిడితనం, హద్దులేని బరితెగింపులు నిత్యకృత్యంగా మారాయని, అన్ని వ్యవస్థలు దారుణంగా నిర్వీర్యమయ్యాయని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వైయస్సార్‌సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం సమావేశమైన ఆయన, కూటమి ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు.
కూటమి పాలన = ఆటవిక రాజ్యం
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, రాష్ట్రంలో ఏ ఒక్క వర్గానికైనా మేలు జరిగిందా? అని జగన్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో అమలులో ఉన్న సంక్షేమ పథకాలన్నీ రద్దయ్యాయని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ గాలికెగిరిపోయాయని విమర్శించారు.
మన పాలన – చంద్రబాబు పాలన మధ్య తేడా ఇదే
తాము మ్యానిఫెస్టోను భగవద్గీతలా భావించి, కోవిడ్ వంటి సంక్షోభ సమయంలోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని జగన్ గుర్తు చేశారు. అయితే చంద్రబాబు పాలన మొత్తం అబద్ధాలు, మోసాలపై నడుస్తోందని ఆరోపించారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.
డీపీటీ కాదు… ‘దోచుకో–తినుకో–పంచుకో’
తమ పాలనలో ఐదేళ్లలో రూ.3.32 లక్షల కోట్ల అప్పు చేస్తే, అందులో రూ.2.73 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ప్రజల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం 20 నెలల్లోనే రూ.3 లక్షల కోట్ల అప్పు చేసిందని, ఆ డబ్బంతా ఎక్కడికి పోయిందన్నదానికి సమాధానం లేదని విమర్శించారు. ఇది దోచుకో–తినుకో–పంచుకో ప్రభుత్వమని ఆరోపించారు.
మద్యం, ఇసుక, గనుల దోపిడి
రాష్ట్రవ్యాప్తంగా మద్యం మాఫియా రాజ్యమేలుతోందని, ఎమ్మార్పీకి మద్యం అమ్మడం లేదని, నకిలీ మద్యం కూడా విక్రయిస్తున్నారని ఆరోపించారు. ఇసుక ఫ్రీ అని చెప్పి డబుల్ ధరకు అమ్ముతున్నారని, గనులను విచ్చలవిడిగా దోచుకుంటున్నారని అన్నారు. సంక్రాంతి పండుగ పేరుతో రికార్డింగ్ డ్యాన్సులు, మొబైల్ వ్యాన్లలో మద్యం అమ్మకాలు జరగడం రాష్ట్రం ఎంత దిగజారిందో చూపుతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వమే ఈ అక్రమాలకు సహకరిస్తోందని ఆరోపించారు.
మహిళలపై దాడులు
కూటమి ప్రజాప్రతినిధుల బరితెగింపుకు అడ్డుకట్ట లేకుండా పోయిందని జగన్ విమర్శించారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తదితరుల ఘటనలను ప్రస్తావిస్తూ, మహిళలపై ఆరోపణలు ఉన్నా చర్యలు లేవని అన్నారు.
యథేచ్ఛగా ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’
రాజకీయ కక్షలతో తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని, అసలు తప్పు చేసిన వారిని మాత్రం వదిలేస్తున్నారని ఆరోపించారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని, వ్యవస్థలన్నీ పతనమయ్యాయని వ్యాఖ్యానించారు. విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు వేల కోట్లలో ఉన్నాయని, ఆరోగ్యశ్రీకి బకాయిలు పెరిగాయని తెలిపారు. వ్యవసాయానికి గిట్టుబాటు ధరలు లేవని, రైతు భరోసా తగ్గించారని విమర్శించారు.
ప్రజల పక్షాన వైయస్సార్‌సీపీ పోరాటం
ఇలాంటి దుర్మార్గ పాలనకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని జగన్ ధీమా వ్యక్తం చేశారు. మరో ఏడాదిన్నరలో తన పాదయాత్ర ప్రారంభమవుతుందని, 150 నియోజకవర్గాల్లో పర్యటించి చంద్రబాబు పాలనను ప్రజల్లో ఎండగడతామని ప్రకటించారు. జగన్ 2.0లో కార్యకర్తలకే టాప్ ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. వారి ద్వారానే తమ పాలన–చంద్రబాబు పాలన మధ్య తేడాను ప్రజలకు స్పష్టంగా చూపిస్తామని అన్నారు. ఈ సమావేశంలో భీమవరం నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ చినమిల్లి వెంకటరాయుడు సహా పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
