Let's talk: editor@tmv.in
రాష్ట్రంలో సర్కార్ నడుస్తోందా.. సర్కస్ నడుస్తోందా?: హ‌రీష్ రావు

రాష్ట్రంలో సర్కార్ నడుస్తోందా.. సర్కస్ నడుస్తోందా?: హ‌రీష్ రావు

Gaddamidi Naveen
12 జనవరి, 2026

తెలంగాణలో ప్రస్తుతం సినిమా పరిశ్రమకు సంబంధించిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా కంటే పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సచివాలయంలోనే జరుగుతున్నట్లు పరిస్తితి ఉందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, ఉంటే ఎవరి కంట్రోల్‌లో ఉంది అనే అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతోందని ఆయన విమర్శించారు.

శాఖ ఒకరిది.. పెత్తనం మరొకరిది!

మాజీ మంత్రి హరీష్ రావు తన ఎక్స్ వేదిక ద్వారా, టికెట్ రేట్ల పెంపు విషయంలో కొత్త జీవోలు బయటకు వస్తున్నప్పటికి సంబంధిత సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలియకుండానే టికెట్ ధరలు పెంచుతూ జీవోలు ఎలా విడుదలవుతున్నాయని హరీష్ రావు ప్రశ్నించారు. ఒకవైపు హోం శాఖ జీవో ఇస్తుంది.. మరోవైపు సంబంధిత మంత్రి మాత్రం నాకు తెలియదు, నా దగ్గరకు ఫైల్ రాలేదు అని నిస్సహాయంగా చెబుతున్నారు. ఐటీ, సివిల్ ఏవియేషన్ మంత్రినని చెప్పుకునే కోమటిరెడ్డికి, తన సొంత శాఖలో ఏం జరుగుతుందో తెలియకపోవడం జాలిని కలిగిస్తోందని ఎద్దేవా చేశారు. ఇది సీఎం నిర్ణయమేనని మంత్రి చెప్పకనే చెబుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో సినిమా శాఖకు మంత్రి ఉన్నట్టే ఉందా లేదా, సంబంధిత మంత్రి తెలియకుండానే జీవోలు విడుదల అవుతున్నాయి. అంటే అసలు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది ఎవరు? ఏ రాజ్యాంగేతర శక్తి ఈ పనులు చేస్తోంది? అని హరీష్ రావు పేర్కొన్నారు.

అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని హరీష్ రావు మండిపడ్డారు.నేను ఈ సీట్లో ఉన్నంత వరకు టికెట్ రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు అని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎలా ఇస్తున్నారు? అని నిలదీశారు.ఇప్పటికే మూడు సినిమాలకు అడ్డగోలుగా రేట్లు పెంచారని, తమకు నచ్చిన వారికి రూ. 600 టికెట్ రేటు వరకు పర్మిషన్లు ఇస్తూ రెడ్ కార్పెట్ పరుస్తున్నారని ఆరోపించారు.

అయితే, సినిమా పరిశ్రమను ఒక పరిశ్రమగా పరిగణించకుండా, రాజకీయ కక్షలను తీర్చుకునే సాధనంగా మార్చడం సిగ్గు తెప్పించే విషయమని హరీష్ రావు విమర్శించారు. గత పదేళ్లలో కేసీఆర్ సినిమా పరిశ్రమను అన్ని కోణాల్లో కాపాడారు. అందరికి సమానంగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు ఈ పరిశ్రమ వాతావరణాన్ని అహంకారం, పిచ్చి చేష్టలు, చిల్లర రాజకీయాల ద్వారా నాశనం చేస్తున్నారు అని ఆయన అన్నారు.

హరీష్ రావు గవర్నర్ దృష్టిని ఆకర్షిస్తూ, ఈ సమస్యపై సమగ్ర విచారణ జరపాలని, మంత్రి లేకుండా జరిగే టికెట్ రేట్ల కమిషన్ల దందాను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలనలో సమానత్వం ఉండాలి. ఒకరికి చుట్టం, మరొకరికి శత్రుత్వం ఉండకూడదు. సినిమా వాళ్లను కూడా మీ రాజకీయాలకు వాడకూడదు అని ఆయన తెలిపారు.