
రాష్ట్రంలో వర్షాల ప్రభావంపై సీఎం ఆరా: అధికారులకు కీలక ఆదేశాలు
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు, ఈదురు గాలుల వల్ల దెబ్బతిన్న పంటల విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించింది. అకాల వర్షాల వల్ల కుదేలైన అన్నదాతను ఆదుకోవడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసం నుంచి జిల్లా కలెక్టర్లు వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులపై ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు.
క్షేత్రస్థాయిలో పెరిగిన నష్టం: రూ. 63 కోట్లు దాటిన ప్రాథమిక అంచనా
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షాల వల్ల 12 జిల్లాల్లోని సుమారు 42 మండలాల్లో వ్యవసాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యంగా 4,840 హెక్టార్లలో మక్కజొన్న, 1,530 హెక్టార్లలో వరి, 310 హెక్టార్లలో మినుము పంటలు నీట మునిగాయి. వీటి విలువ సుమారు రూ. 40 కోట్లుగా అంచనా వేశారు. ఇక ఉద్యానవన పంటల విషయానికొస్తే 9 జిల్లాల్లోని 48 మండలాల్లో మామిడి, అరటి, పప్పుధాన్యాలు, మిరప, కూరగాయలు,నిమ్మ తోటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని దీని విలువ సుమారు రూ.23 కోట్లు ఉంటుందని ప్రాథమికంగా లెక్కగట్టారు. కాగా ఈ నష్టంపై త్వరితగతిన పూర్తిస్థాయి నివేదికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
ఇంధన సరఫరాలో అంతరాయం కలగకూడదు
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఇంధన సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఎల్‌పీజీ కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని కేవలం సంప్రదాయ ఇంధనాలపైనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. ఇండక్షన్ స్టౌలు, పైపుల ద్వారా సరఫరా అయ్యే గ్యాస్, ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, పాఠశాలలు, ఆలయాలకు గ్యాస్ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని హెచ్చరించారు.
అంతర్జాతీయ ఉద్రిక్తతలు - ముందస్తు అప్రమత్తత
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇరాన్-ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ప్రపంచ సరఫరా గొలుసు దెబ్బతినే ప్రమాదం ఉందని సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో ఎరువులు, పెట్రోల్, డీజిల్ వంటి అత్యవసర వస్తువుల కొరత ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా సామాన్యులకు ఇబ్బంది కలగకుండా నిత్యావసరాల ధరలను పర్యవేక్షించాలని స్పష్టం చేశారు.
