Let's talk: editor@tmv.in
రాష్ట్రంలో రోడ్లు చిధ్రం... ప్రజలకు నిత్య నరకం!

రాష్ట్రంలో రోడ్లు చిధ్రం... ప్రజలకు నిత్య నరకం!

T Venkata Ramana
6 అక్టోబర్, 2025

రాష్ట్రంలో మొన్నటి వరకూ కురిసిన ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని రహదారులు పూర్తిగా చిధ్రమై ప్రజలకు నిత్యం నరకాన్ని చూపుతున్నాయి. హైదరాబాద్ సిటీ నుంచి మారుమూల గ్రామాల వరకు రోడ్ల పరిస్థితి దారుణంగా మారింది. వర్షాల ధాటికి రోడ్లపై ఎక్కడికక్కడ పెద్ద పెద్ద గుంతలు పడటం, కొన్ని చోట్ల రోడ్లు పూర్తిగా కొట్టుకుపోవడంతో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరీ ముఖ్యంగా ఈ అధ్వానమైన రోడ్ల మరమ్మతులపై కాంగ్రెస్ ప్రభుత్వం కనీస సోయి కూడా లేకుండా నిర్లక్ష్యం వహిస్తోందని బీఆర్‌ఎస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.

హైదరాబాద్‌లో రోడ్ల విధ్వంసం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. నగరంలోని ప్రధాన మార్గాల్లో గుంతలు పడి వర్షం పడినప్పుడు అవి నీటితో నిండి ప్రజలను భయపెడుతున్నాయి.

రేతిబౌలి, నానల్ నగర్ సిగ్నళ్ల వద్ద రోడ్లు భారీగా ధ్వంసం కావడంతో ట్రాఫిక్ స్లోగా సాగుతున్నది. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ వెళ్లే రోడ్డు పూర్తిగా దెబ్బతింది. చాదర్‌ఘాట్, దారుల్ షిఫా ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పాట్‌ హోల్స్ ఏర్పడ్డాయి. నల్లకుంట, బాగ్ లింగంపల్లిలోని మెయిన్ రోడ్డు పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. చందానగర్ నుంచి అమీన్‌పూర్ వెళ్లే రోడ్డుపై అడుగుకో గుంత కనిపిస్తున్నది. వనస్థలిపురం వంటి ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా పాడయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 14,871 చోట్ల రోడ్లపై గుంతలు పడినట్లు జీహెచ్ఎంసీ గుర్తించింది. తాము వీటిలో 12,564 గుంతలకు రిపేర్లు చేసినట్లు అధికారులు చెబుతున్నా, ఇంకా వేలాది చోట్ల ప్రజలు నరకం అనుభవిస్తున్నారని తెలుస్తోంది.

జిల్లాలో తెగిన రోడ్లు

జిల్లాల్లోనూ పరిస్థితి ఏ మాత్రం మెరుగ్గా లేదు. అనేక చోట్ల రోడ్లు తెగిపోవడంతో ప్రయాణాలు ప్రమాదకరంగా మారాయి. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కంకెట - వైకుంఠపూర్ గ్రామాల మధ్య ఉన్న ప్రధాన బీటీ రోడ్డు సుమారు 50 మీటర్ల మేర తెగిపోయింది. మరికొన్ని చోట్ల కంకర తేలి రాత్రి సమయంలో ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారు.

కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ నుంచి అశోక్‌నగర్ కాలనీలోని ర్లైల్వే గేట్ వరకు వేసిన బీటీ రోడ్డు నాలుగైదు చోట్ల భారీ గుంతలు పడటంతో టూ వీలర్స్ పైన వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు.

కాంగ్రెస్ సర్కార్‌పై ధ్వజం

రాష్ట్రవ్యాప్తంగా రోడ్లన్నీ పూర్తిగా అధ్వానంగా మారినా వాటి మరమ్మతులకు కాంగ్రెస్ ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయడం లేదని బీఆర్‌ఎస్ తీవ్రంగా విమర్శిస్తోంది.

తెలంగాణ వ్యాప్తంగా ధ్వంసమైన రహదారులతో ప్రజలు నిత్య నరకం అనుభవిస్తున్నారని, రోడ్లకు కనీసం ప్యాచ్‌వర్క్ చేయాలనే సోయి కూడా సర్కార్ కు లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. వర్షం పడితే సిటీలో ట్రాఫిక్ జామ్‌లు నిత్యకృత్యమయ్యాయి. గుంతలమయమైన రోడ్లతో ప్రజలు పడుతున్న కష్టాలకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. తక్షణమే రోడ్ల మరమ్మతులను చేపట్టి, ప్రజల కష్టాలను తీర్చాలని బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తోంది.

రాష్ట్రంలో రోడ్లు చిధ్రం... ప్రజలకు నిత్య నరకం! - Tholi Paluku