
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది: మాజీ మంత్రి రజిని
గుంటూరులో ఓ మహిళపై దాడి చేసి వివస్త్రను చేసిన ఘటన రాష్ట్రంలో మహిళల భద్రత క్షీణించిందనడానికి నిదర్శనమని, టీడీపీ నేతలు అధికారమదంతో దాడులకు తెగబడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. గుంటూరు కృష్ణబాబు కాలనీలో అమానవీయ దాడికి గురైన బాధిత మహిళా కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మాజీ మంత్రి విడదల రజిని, వైయస్సార్‌సీపీ మహిళా నేతలు సోమవారం పరామర్శించి, పార్టీ తరఫున పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అనంతరం విడదల రజిని మీడియాతో మాట్లాడుతూ.. ఒక మహిళ తన ఇంటి ముందు బోరు మరమ్మతు చేసుకుంటుండగా, టీడీపీ వార్డు సెక్రటరీ మల్లెల రమణమూర్తి రూ. 10 వేలు మామూలు డిమాండ్ చేశాడన్నారు. ఆమె నిరాకరించడంతో ఆ కుటుంబంపై రెండుసార్లు దాడి చేసి, మహిళను వివస్త్రను చేయడం అమానుషమన్నారు. ఈ ఘటనపై బాధిత కుటుంబం రెండుసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, సీసీటీవీ ఫుటేజీ, వీడియోలు వైరల్ అయిన తర్వాతే కేసు నమోదు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే సైతం తక్షణ చర్యలు తీసుకోకుండా రాజీ ప్రయత్నాలు చేయడం దారుణమన్నారు.
హోంమంత్రి రాజీనామాకు డిమాండ్
రాజధాని ప్రాంతంలోనే మహిళలకు రక్షణ లేకపోవడం కూటమి ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని వైయస్సార్‌సీపీ మహిళా నేతలు మండిపడ్డారు. ఈ అమానవీయ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మహిళల భద్రతను గాలికి వదిలేసి కేవలం 'రెడ్ బుక్' రాజకీయాలపైనే దృష్టి పెట్టిందని రజిని విమర్శించారు. మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఈ నెల 21న రాష్ట్రవ్యాప్తంగా అన్ని అంబేద్కర్ విగ్రహాల వద్ద వైయస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు.
