Let's talk: editor@tmv.in
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాదు ‘రెడ్ బుక్’ రాజ్యాంగం నడుస్తుంది: జగన్

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాదు ‘రెడ్ బుక్’ రాజ్యాంగం నడుస్తుంది: జగన్

Panthagani Anusha
17 జనవరి, 2026

పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మాండా సల్మాన్‌ మృతి రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపింది. ప్రత్యర్థుల దాడిలో తీవ్రంగా గాయపడి మూడు రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన సల్మాన్‌ కన్నుమూయడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనను రాజకీయ హత్యగా అభివర్ణించిన వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా 'ఎక్స్' వేదికగా విమర్శల వర్షం కురిపించారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కాకుండా ‘రెడ్ బుక్’ రాజ్యాంగం నడుస్తోందని జగన్ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి అల్లకల్లోలాన్ని ప్రోత్సహించడం అమానుషమని దుయ్యబట్టారు. రాజకీయాల కోసం ఇంకెన్ని ప్రాణాలు బలి తీసుకుంటారు? దళితుడు, పేదవాడైన సల్మాన్ అనారోగ్యంతో ఉన్న భార్యను చూడటానికి వస్తే ఇనుప రాడ్లతో దాడి చేసి ప్రాణాలు తీయడం దారుణం. మీరు పాలించడానికి అసలు అర్హులేనా? అని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఈ హత్యకు ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ దాడుల వెనుక పక్కా ప్రణాళిక ఉందని జగన్ ఆరోపించారు. ముఖ్యమంత్రి, అధికార పార్టీ నేతలు కొందరు పోలీసు అధికారులు కుమ్మక్కై వైకాపా కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. సల్మాన్‌పై దాడి చేసిన నిందితులపై చర్యలు తీసుకోకపోగా బాధితుడిపైనే తప్పుడు కేసులు నమోదు చేయడం పోలీసు వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనమని జగన్ పేర్కొన్నారు. పల్నాడులో సాగుతున్న ఈ అరాచకాల వల్ల వందలాది కుటుంబాలు ప్రాణభయంతో గ్రామాలు విడిచి వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పౌరులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను విస్మరించి పార్టీ ప్రయోజనాల కోసం శాంతిభద్రతలను పణంగా పెట్టడం అనైతికమని జగన్ స్పష్టం చేశారు. ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనే" అని ఆయన పేర్కొన్నారు. హింసా రాజకీయాలను ప్రజలు ఎప్పటికీ క్షమించరని ఈ రక్తపాతానికి కూటమి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మృతుడు సల్మాన్ కుటుంబానికి వైఎస్సార్‌సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని, తమ పార్టీ కార్యకర్తలకు రక్షణ కల్పించే బాధ్యతను తాము తీసుకుంటామని జగన్ భరోసా ఇచ్చారు.