

రాష్ట్రంలో పవర్ కట్ అనేదే లేదు: డిప్యూటీ సీఎం భట్టి
ఎల్‌నినో వాతావరణ ప్రభావంతో వర్షాకాలంలోనూ డిమాండ్ పెరిగి, మరోవైపు జల విద్యుత్ నిలిచిపోయినప్పటికీ.. ఒకేసారి పడిన 7,000 మెగావాట్ల అదనపు భారాన్ని తెలంగాణ విద్యుత్ వ్యవస్థ అత్యంత సమర్థవంతంగా తట్టుకుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. హనుమకొండలోని ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) ప్రధాన కార్యాలయంలో విద్యుత్ రంగ ప్రగతిపై ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, సీఎండీ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. సాధారణంగా వర్షాకాలంలో 11,000 మెగావాట్లుగా ఉండే పీక్ డిమాండ్ అనూహ్యంగా 16,500 మెగావాట్లకు చేరిందని, ప్రాజెక్టుల్లో నీరు లేక 2,000 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. అయినప్పటికీ ముందస్తు ప్రణాళికలతో నిరంతరాయంగా ఉచిత, నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. కాళేశ్వరం, దేవాదుల, సీతారామ వంటి ఎత్తిపోతల పథకాలతో పాటు వర్షాభావం కారణంగా రైతులు బోర్‌వెల్లను అధికంగా వినియోగించడంతో విద్యుత్ అవసరాలు పెరిగినా ప్రభుత్వం సమర్థంగా నిర్వహించిందన్నారు. రాష్ట్రంలో పవర్ కట్ అనే పరిస్థితి లేదని, తుఫాన్లు, ఈదురుగాలులు, చెట్లు కూలడం వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల మాత్రమే తాత్కాలిక అంతరాయం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. 'ప్రజాబాట', 'పొలంబాట' కార్యక్రమాల ద్వారా అధికారులు నేరుగా ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తున్నారని తెలిపారు. గతంలో ఎక్కువ వడ్డీలతో తెచ్చిన పాత రుణాలను రీస్ట్రక్చరింగ్ చేయడం ద్వారా డిస్కంలను దేశంలోనే నంబర్-1 స్థానంలో నిలుపుతామని ధీమా వ్యక్తం చేశారు.
సేవా ప్రమాణాలను పెంచేందుకు దేశంలోనే తొలిసారిగా 'ఎలక్ట్రిసిటీ ఆంబ్యులెన్స్' సేవలను అందుబాటులోకి తెచ్చామని ప్రకటించారు. వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912కి ఫోన్ చేయగానే, కృత్రిమ మేధస్సు (ఏఐ) సాంకేతికత ద్వారా సమాచారం క్షణాల్లో ఆంబ్యులెన్స్ సిబ్బందికి చేరుతుందని, నిమిషాల వ్యవధిలోనే ఘటనా స్థలానికి వెళ్లి సమస్యను పరిష్కరిస్తారని వివరించారు.
విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు సిబ్బంది మరణిస్తే ఆ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు రూ. 1.20 కోట్ల బీమా సౌకర్యాన్ని కల్పించామన్నారు. గృహజ్యోతి పథకం కింద 53 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్ బిల్లుల మొత్తంతో పాటు, 30 లక్షల వ్యవసాయ పంప్‌సెట్లకు ఏటా అయ్యే రూ. 14,000 కోట్ల సబ్సిడీ నిధులను ఆర్థిక శాఖ నేరుగా డిస్కంలకు విడుదల చేస్తోందని ఆయన వెల్లడించారు.
