
రాష్ట్రంలో తగ్గుతున్న జనన రేటు.. భవిష్యత్తుకు ముప్పు: మంత్రి సత్య కుమార్ యాదవ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తులో ఒక పెను సవాలును ఎదుర్కోబోతోంది. ఇన్నాళ్లూ జనాభా పెరుగుదల శాపమని భావించగా, ఇప్పుడు తరుగుతున్న సంతానోత్పత్తి రేటు రాష్ట్ర ఆర్థిక, సామాజిక పునాదులను కదిలించే 'టైం బాంబులా మారుతోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు సోమవారం విడుదల చేసిన ఒక సమగ్ర ప్రకటనలో ఆయన రాష్ట్ర జనాభా గమనాన్ని విశ్లేషిస్తూ తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. గత కొన్ని దశాబ్దాలుగా అమలు చేసిన కఠిన నియంత్రణల వల్ల సంతానోత్పత్తి రేటు ఉండాల్సిన 2.10 శాతం కంటే గణనీయంగా తగ్గి 1.50 శాతానికి పడిపోవడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
వృద్ధుల భారంతో 'పాపులేషన్ డెట్' ప్రమాదం
రాష్ట్రంలో శ్రామిక శక్తి క్రమంగా తగ్గుతూ వృద్ధుల సంఖ్య రెట్టింపు కావడంపై మంత్రి గణాంకాలతో సహా వివరించారు. కాగా ప్రస్తుతం ఏపీ మధ్యస్థ వయస్సు 32.50 ఏళ్లు కాగా, దేశ సగటు కేవలం 28 ఏళ్లు మాత్రమే ఉంది. అంటే దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ వేగంగా వార్ధక్యం వైపు అడుగులు వేస్తోంది. 2011లో 14 ఏళ్ల లోపు పిల్లల జనాభా 25 శాతంగా ఉండగా 2036 నాటికి అది 15 శాతానికి పడిపోనుందని అంచనా ఇదే సమయంలో 60 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య 10 శాతం నుంచి 19 శాతానికి (2036 నాటికి), అటుపై 2047 నాటికి 23 శాతానికి చేరుతుందని మంత్రి వివరించారు. దీనివల్ల యువశక్తి ద్వారా వచ్చే ప్రయోజనం పోయి జనాభా ఒక భారంగా మారే ప్రమాదం ఉందని ఆయన స్పష్టం చేశారు.
కొత్త దారిలో జనాభా విధానం: 2035 లక్ష్యం
ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు ప్రభుత్వం ఒక సరికొత్త 'జనాభా స్థిరీకరణ ఫ్రేమ్‌వర్క్'ను సిద్ధం చేసింది. జనాభా నియంత్రణ అనే పాత పద్ధతులకు స్వస్తి పలికి దంపతులు స్వచ్ఛందంగా ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనేలా సానుకూల వాతావరణాన్ని కల్పించడమే ఈ విధానం ఉద్దేశం. 2035 నాటికి సంతానోత్పత్తి రేటును తిరిగి 2.10 శాతానికి పెంచి జనాభాను స్థిరీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం మాతా శిశు సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వంధ్యత్వ సమస్యలతో బాధపడుతున్న 12 లక్షల కుటుంబాలకు ఉచిత వైద్య సేవలు అందించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు.
ఐదు మూలస్తంభాలపై 'స్వర్ణాంధ్ర' నిర్మాణం
జనాభా సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ఐదు కీలక సూత్రాలు ప్రకటించింది
• మాతృత్వ: సురక్షిత ప్రసవాలు, తల్లీబిడ్డల ఆరోగ్యానికి పూర్తి హామీ. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల శాతాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన సంతానోత్పత్తికి ప్రోత్సాహం.
• సంజీవని: ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ రికార్డులు రూపొందించి, అన్ని దశల్లోనూ ఆరోగ్య రక్షణ కల్పించడం.
• శక్తి: మహిళా సాధికారత ద్వారా ఆర్థిక స్వావలంబన. శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని 60 శాతానికి పెంచి జీఎస్‌డీపీలో 15 శాతం వృద్ధి సాధించడం.
• క్షేమ: వృద్ధాప్యంలో సామాజిక, మానసిక భద్రత కల్పిస్తూ గౌరవప్రదమైన జీవనానికి భరోసా.
• నైపుణ్యం: యువతకు నిరంతర నైపుణ్య శిక్షణ ద్వారా వారిని ఉత్పాదక శక్తిగా మార్చడం.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రూపొందించిన ఈ నూతన విధాన పత్రాన్ని త్వరలోనే బహిరంగ చర్చ కోసం ప్రజల ముందుకు తీసుకురానున్నట్లు మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. కేవలం ప్రభుత్వ చర్యలతోనే ఇది సాధ్యం కాదని ప్రజలు, మీడియా అన్ని వర్గాల భాగస్వామ్యంతో ఇదొక ప్రజా ఉద్యమంగా మారాలని ఆయన పిలుపునిచ్చారు
