
రాష్ట్రంలో తగ్గిన నేరాలు
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన ఏడాది కాలంలో శాంతిభద్రతల పరిస్థితి మెరుగుపడిందని నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టిందని రాష్ట్ర డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. సోమవారం నిర్వహించిన వార్షిక ప్రెస్ కాన్ఫరెన్స్ 2025లో ఆయన కీలక గణాంకాలను విడుదల చేశారు. బలమైన పోలీసింగ్, పక్కాగా అమలు చేస్తున్న నివారణ చర్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నేరాలు 6.17 శాతం మేర తగ్గాయని ఆయన వివరించారు. 2024లో రాష్ట్రవ్యాప్తంగా 1.1 లక్షలకు పైగా కేసులు నమోదు కాగా 2025 నాటికి ఆ సంఖ్య 1.03 లక్షలకు చేరుకోవడం పోలీసు యంత్రాంగం సాధించిన విజయమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో గతంతో పోలిస్తే అల్లర్ల కేసులు అత్యధికంగా 53.88 శాతం తగ్గుముఖం పట్టడం గమనార్హం. గతేడాది 534 అల్లర్ల కేసులు నమోదు కాగా ఈసారి ఆ సంఖ్య 246కు పరిమితమైందని డీజీపీ తెలిపారు. అదేవిధంగా శారీరక దాడులు, హింసకు సంబంధించిన నేరాలు కూడా 10.21 శాతం తగ్గాయన్నారు. బడుగు, బలహీన వర్గాల రక్షణలోనూ మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఎస్సీ, ఎస్టీలపై జరిగే నేరాలు 2,402 నుంచి 1,818కి తగ్గాయని ఆయన వివరించారు. మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి సారించామని, పోక్సో కేసులు కూడా గణనీయంగా తగ్గాయని, దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
అయితే డిజిటల్ యుగంలో ఆర్థిక నేరాలు పోలీసులకు కొత్త సవాలుగా మారుతున్నాయని డీజీపీ అభిప్రాయపడ్డారు. ఇతర నేరాలు తగ్గినప్పటికీ, ఆర్థిక నేరాలు మాత్రం 4.78 శాతం వృద్ధి చెందాయని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాలు చైనా వంటి విదేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తున్నాయని, బాధితుల నుంచి దోచుకున్న సొమ్మును వెంటనే విదేశాలకు తరలించడం వల్ల రికవరీ ప్రక్రియ క్లిష్టంగా మారుతోందని పేర్కొన్నారు. ఐటీ చట్టం కింద నమోదయ్యే సైబర్ కేసులు తగ్గినప్పటికీ, ఆర్థిక లావాదేవీల మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
నేరాల అదుపులో భాగంగా రౌడీ షీటర్లపై ఉక్కుపాదం మోపుతున్నట్లు గుప్తా వివరించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 26,518 రౌడీ షీట్లు కొనసాగుతున్నాయని, రౌడీయిజాన్ని సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలన కోసం 'ఈగిల్', 'గరుడ' వంటి ప్రత్యేక ఆపరేషన్లు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఫోరెన్సిక్ విభాగంలో పెండింగ్ కేసులను పరిష్కరించడం టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ ద్వారా స్పందన సమయాన్ని తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ దేశంలోనే మెరుగైన స్థానంలో ఉందని డీజీపీ ప్రకటించారు.
