Let's talk: editor@tmv.in
రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్రంలో గ్యాస్ కొరత లేదు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Gaddamidi Naveen
14 మార్చి, 2026

తెలంగాణ రాష్ట్రంలో వంట గ్యాస్ కొరత లేదని, వినియోగదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్పీజీ సరఫరా, వేసవి తాగునీటి ఎద్దడి నివారణ 'ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక' అమలుపై ఈ సమావేశంలో సమీక్షించారు.

తెలంగాణలో బలమైన ఎల్పీజీ పంపిణీ వ్యవస్థ ఉందని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో సుమారు 1.29 కోట్ల గృహ వినియోగ ఎల్పీజీ కనెక్షన్లు ఉండగా, వాటికి సేవలందించేందుకు 810 డిస్ట్రిబ్యూటర్లు పనిచేస్తున్నారు. రోజువారీగా రాష్ట్రంలో దాదాపు 2.5 లక్షల సిలిండర్ల అవసరం ఉంది. ఇందులో గృహ వినియోగదారుల వాటా సుమారు 86 శాతం కాగా, కమర్షియల్ వినియోగం 14 శాతం మాత్రమే ఉందని అధికారులు వివరించారు.

రాష్ట్రంలోని ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లలో ఎక్కడా సరఫరా అంతరాయం లేదని అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో గృహ వినియోగ అవసరాల్లో 90 శాతం కంటే ఎక్కువ డిమాండ్‌ను నిరంతరం తీర్చగలిగామని కూడా వెల్లడించారు. సరఫరా గొలుసు సక్రమంగా కొనసాగుతోందని, కొత్త సరుకులు నిరంతరం రాష్ట్రానికి చేరుతున్నాయని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం 10,611 మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇది సుమారు 6.97 లక్షల సిలిండర్లకు సమానమని పేర్కొంటూ, వినియోగదారులు ఆందోళనతో 'పానిక్ బుకింగ్' చేయవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎల్పీజీ కొరత ఉందనే ప్రచారం నిజం కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వంటగ్యాస్ సరఫరా సాధారణంగా కొనసాగుతోందని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

రాష్ట్రంలో గృహ వినియోగదారులు, ఆసుపత్రులు, ప్రభుత్వ హాస్టళ్లకు ఎలాంటి అంతరాయం లేకుండా వంటగ్యాస్ సరఫరా కొనసాగాలని అధికారులకు సూచించారు. ఎల్పీజీ కొరతపై తప్పుడు ప్రచారం జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కడైనా బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంటే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సరఫరా వ్యవస్థను సమర్థంగా నిర్వహించాలని కూడా తెలిపారు.

అయినా సరఫరా వ్యవస్థ స్థిరంగా కొనసాగుతోందని, ప్రజలు అనవసరంగా భయపడకుండా అవసరానికి అనుగుణంగా మాత్రమే సిలిండర్లు బుక్ చేసుకోవాలని మంత్రి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఎల్పీజీ సరఫరా పూర్తిగా నియంత్రణలో ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రాష్ట్రంలో గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.ఎల్పీజీ సరఫరాపై ప్రతిరోజూ సమీక్ష నిర్వహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వలను, బ్లాక్ మార్కెటింగ్ విక్రయాలను అడ్డుకోవడానికి గ్యాస్ ఏజెన్సీల వద్ద పోలీసు నిఘా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో కనీస బుకింగ్ గ్యాప్‌ను 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులుగా నిర్ణయించారు. దీంతో సిలిండర్ల దుర్వినియోగాన్ని తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఈ సమీక్షా సమావేశంలో పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఎల్పీజీ సరఫరాపై పర్యవేక్షణను బలోపేతం చేయడానికి రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర స్థాయిలో ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన స్టేట్ లెవల్ ఎల్పీజీ సప్లై కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ రాష్ట్రంలో నిల్వలు, పంపిణీ వ్యవస్థ, నియమాల అమలును నిరంతరం పర్యవేక్షిస్తుంది.

జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పడి ప్రతిరోజూ సరఫరా పరిస్థితిని సమీక్షిస్తాయి. పౌర సరఫరాల శాఖ, పోలీసులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్రతినిధులు ఈ కమిటీలలో భాగస్వాములై సమన్వయంతో పనిచేస్తారు.

సిలిండర్ డెలివరీలో పారదర్శకత కోసం ఓటీపీ ఆధారిత డెలివరీ వెరిఫికేషన్ వ్యవస్థను కూడా అమలు చేస్తున్నారు. వినియోగదారు బుక్ చేసిన సిలిండర్ పంపిణీ సమయంలో నమోదైన మొబైల్ నంబర్‌కు ఓటీపీ పంపబడుతుంది. ఆ ఓటీపీని వినియోగదారు తెలిపిన తరువాతే డెలివరీ సిబ్బంది సిలిండర్ అందజేస్తారు. దీంతో అనధికారికంగా సిలిండర్లు ఇతరులకు వెళ్లే అవకాశాలు తగ్గుతాయని అధికారులు తెలిపారు.

బ్లాక్ మార్కెటింగ్, నిల్వల దాచిపెట్టడం, అక్రమ మార్పిడి వంటి చర్యలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం కింద అనేక కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. డిస్ట్రిబ్యూటర్ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే లైసెన్సులను కూడా రద్దు చేసే చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు సూచించారు.

అయితే ప్రభుత్వం కొరత లేదని ప్రకటించినప్పటికీ, ఇటీవల సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల కారణంగా గ్యాస్ సిలిండర్ల బుకింగ్ ఒక్కసారిగా పెరిగింది. తెలంగాణ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కల్లూరి జగన్ మోహన్ రెడ్డి ప్రకారం, వినియోగదారులు ఒకేసారి పెద్ద సంఖ్యలో బుకింగ్ చేయడంతో పంపిణీ వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. కొన్ని డిస్ట్రిబ్యూటర్ కేంద్రాల్లో సాంకేతిక, నిర్వహణ సమస్యలు కూడా ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు.