Let's talk: editor@tmv.in
రాష్ట్రంలో కారవాన్‌ల సందడి మొదలు!

రాష్ట్రంలో కారవాన్‌ల సందడి మొదలు!

FL - SUNL
9 అక్టోబర్, 2025

ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక రంగంలో మరో విప్లవాత్మక మార్పు రాబోతోంది. పర్యాటకుల ఇళ్ల వద్దకే చేరుకునే కారవాన్‌ పర్యాటక వాహనాలు త్వరలో రాష్ట్రంలో దర్శనమివ్వనున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా పర్యాటకులు తమ ఇళ్ల నుంచి నేరుగా సందర్శనీయ ప్రాంతాలకు సౌకర్యవంతంగా ప్రయాణించగలరు. రాష్ట్ర ప్రభుత్వం ఈ వినూత్న ఆలోచనకు అనుగుణంగా ప్రత్యేక కారవాన్‌ పాలసీని సిద్ధం చేస్తోంది.

ఇంటి వద్దకే పర్యాటక సౌకర్యం

ఇప్పటి వరకు పర్యాటకులు వసతి, ప్రయాణం కోసం వేర్వేరు ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చేది. కానీ కారవాన్‌ వాహనాల ద్వారా ప్రయాణం, వసతి, భోజనం అన్నీ ఒకే చోట అందుబాటులోకి రానున్నాయి. ఇవి ఆధునిక సౌకర్యాలతో కూడిన “మొబైల్‌ హోమ్‌లు” వంటివి. పర్యాటకులు ఈ వాహనాలను బుక్‌ చేసుకుని, తమ ఇళ్ల వద్ద నుంచే అరకు, లంబసింగి, గండికోట, సూర్యలంక బీచ్‌, శ్రీశైలం, తిరుపతి వంటి ప్రాంతాలకు బయల్దేరవచ్చు.

ప్రైవేట్‌ ఆపరేటర్లకు ప్రత్యేక రాయితీలు

కారవాన్‌ పాలసీ ప్రకారం, మొదటి 25 వాహనాలకు 100 శాతం లైఫ్‌టాక్స్‌ మినహాయింపు (రూ.3 లక్షల వరకు)

తదుపరి 13 వాహనాలకు 50 శాతం మినహాయింపు (రూ.2 లక్షల వరకు)

మరిన్ని 12 వాహనాలకు 25 శాతం మినహాయింపు (రూ.1 లక్ష వరకు)

అదనంగా, ఏడేళ్లపాటు ఎస్‌జీఎస్‌టీ రీఫండ్‌ సౌకర్యం ఇవ్వనున్నారు. దీనితో ప్రైవేట్‌ ఆపరేటర్లు కారవాన్‌ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారని అధికారులు భావిస్తున్నారు.

పర్యాటకాభివృద్ధికి బలమైన అడుగు

ప్రస్తుతం రాష్ట్రంలో స్వదేశ్‌ దర్శన్‌ 2.0, సాస్కీ ప్రాజెక్టులు, డెస్టినేషన్‌ డెవలప్‌మెంట్‌ ప్రణాళికలు అమలులో ఉన్నాయి. గండికోట, గోదావరి ప్రాంతాల అభివృద్ధికి రూ.172.35 కోట్లు అరకు, లంబసింగి, సూర్యలంక బీచ్‌ల అభివృద్ధికి రూ.127.39 కోట్లు. అహోబిలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులకు రూ.49.49 కోట్లు. ఈ ప్రాజెక్టుల పర్యాటక విలువను పెంచడానికి కారవాన్‌ వాహనాలు కీలక పాత్ర పోషించనున్నాయి

వాహనాల్లో ప్రత్యేక సౌకర్యాలు

ఈ కారవాన్‌ వాహనాలు చిన్న బస్సు పరిమాణంలో ఉంటాయి. 2-6 మందికి సరిపడేలా రూపొందిస్తారు. పడకలు, డైనింగ్‌ ఏరియా, గ్యాస్‌ స్టవ్‌, ఇండక్షన్‌ కుక్కర్‌, ఫ్రిజ్‌, మైక్రోవేవ్‌ ఓవెన్‌, తాగునీటి ట్యాంక్‌, సింక్‌, బాత్‌రూమ్‌, టాయిలెట్‌, షవర్‌, వాష్‌బేసిన్‌, ఎయిర్‌ కండిషనర్‌, హీటర్‌, వై-ఫై, టెలివిజన్‌ జీపీఎస్‌ ట్రాకింగ్‌, అగ్నిమాపక పరికరాలు, ప్రాథమిక చికిత్స కిట్‌ అన్నీ కలిపి - ఒక చిన్న మొబైల్‌ హోటల్‌ లా ఈ వాహనాలు రూపుదిద్దుకుంటాయి.

తొలి దశలో ఈ రూట్లలో

విశాఖపట్నం - అరకు,విశాఖపట్నం - లంబసింగి, విజయవాడ - గండికోట, విజయవాడ - సూర్యలంక బీచ్‌, విజయవాడ - నాగార్జునసాగర్‌, విజయవాడ - శ్రీశైలం, విజయవాడ - తిరుపతి

ఈ మార్గాలలో కారవాన్‌ పర్యటనలు ప్రారంభమైతే రాష్ట్ర పర్యాటక రంగంలో కొత్త యుగం మొదలవుతుంది. ఇంటి వద్దకే వసతి సౌకర్యం కలిగిన ఈ కారవాన్లు రాష్ట్ర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిలబెడుతాయి. కేరళ, గోవా, కర్ణాటక మాదిరిగానే, ఆంధ్రప్రదేశ్‌ కూడా ఇప్పుడు కారవాన్‌ టూరిజంలో చోటు సంపాదించనుంది.

రాష్ట్రంలో కారవాన్‌ల సందడి మొదలు! - Tholi Paluku