Let's talk: editor@tmv.in
రాష్ట్రంలో ఇంధన కొరత లేదు: ఏపీ పౌరసరఫరాల శాఖ డైరెక్టర్

రాష్ట్రంలో ఇంధన కొరత లేదు: ఏపీ పౌరసరఫరాల శాఖ డైరెక్టర్

Panthagani Anusha
8 ఏప్రిల్, 2026

ఆంధ్రప్రదేశ్‌లో వంటగ్యాస్ (ఎల్‌పీజీ), పెట్రోల్, డీజిల్, ఎరువుల కొరత ఉందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ నూపూర్ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్‌కు అనుగుణంగా సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, సరఫరా వ్యవస్థను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

సరిపడా గ్యాస్ నిల్వలు

రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 14,000 టన్నుల ఎల్‌పీజీ స్టాక్ అందుబాటులో ఉందని కాగా రాష్ట్రవ్యాప్తంగా రోజువారీ వినియోగం 4,000 టన్నులుగా ఉండగా, సరఫరా 4,100 టన్నులుగా ఉందని పేర్కొన్నారు. వినియోగదారులకు 100 శాతం హోమ్ డెలివరీ సౌకర్యం కల్పిస్తున్నామని, గ్యాస్ కోసం ఏజెన్సీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని బుకింగ్స్ కోసం వాట్సాప్, మిస్డ్ కాల్స్ లేదా మొబైల్ యాప్‌లను వినియోగించుకోవాలని సూచించారు.

ప్యానిక్ బుకింగ్‌పై నియంత్రణ

మరోవైపు అనవసరపు ఆందోళనతో గ్యాస్ సిలిండర్లను ముందే బుక్ చేసుకోవడాన్ని ( ప్యానిక్ బుకింగ్‌ ) అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నగర ప్రాంతాల్లో ఒక సిలిండర్ తీసుకున్న 25 రోజుల తర్వాత, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల తర్వాత మాత్రమే తదుపరి బుకింగ్‌కు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. సిలిండర్ల పంపిణీలో పారదర్శకత కోసం 90 శాతం ఓటీపీ ఆధారిత డెలివరీని అమలు చేస్తున్నామని అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

అక్రమాలపై ఉక్కుపాదం

గ్యాస్ సిలిండర్ల అక్రమ రవాణా, అనధికార వినియోగంపై పౌరసరఫరాల శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. మార్చి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,000కి పైగా కేసులు నమోదు చేసినట్లు డైరెక్టర్ తెలిపారు. ఈ దాడుల్లో సుమారు 4,400 అక్రమ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. వాణిజ్య అవసరాలకు గృహ వినియోగ సిలిండర్లను వాడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పెట్రోల్, డీజిల్ సరఫరా యథాతథం

రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో నిల్వలు పుష్కలంగా ఉన్నాయని పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేదని నూపూర్ అజయ్ కుమార్ తెలిపారు. అదేవిధంగా ధరల్లోనూ ఎటువంటి మార్పులు లేవని, ప్రజలు పుకార్లను నమ్మి బంకుల వద్ద క్యూ కట్టవద్దని కోరారు. ప్రభుత్వం అందిస్తున్న అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని అనవసరంగా ఇంధనాన్ని నిల్వ చేయవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.