Let's talk: editor@tmv.in
రావి నారాయణ రెడ్డికి సముచిత గౌరవం కల్పిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

రావి నారాయణ రెడ్డికి సముచిత గౌరవం కల్పిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
3 ఫిబ్రవరి, 2026

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, పద్మవిభూషణ్ రావి నారాయణ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో 'తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు' ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 2025 సంవత్సరానికి గాను ‘రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కారాన్ని’ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా అందజేశారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి వంటి నిబద్ధత గల వ్యక్తికి ఈ పురస్కారం దక్కడం తెలంగాణ సమాజానికి గర్వకారణమని సీఎం కొనియాడారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన సమరయోధుడు రావి నారాయణ రెడ్డికి తెలంగాణ సమాజంలో సముచిత గౌరవం కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అరాచక శక్తులకు వ్యతిరేకంగా సాగిన సాయుధ రైతాంగ పోరాటంలో రావి నారాయణ రెడ్డి కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.భూస్వామ్య కుటుంబంలో పుట్టినా, పేద ప్రజల సంక్షేమం కోసం తనకు ఉన్న 500 ఎకరాల భూమిని దానం చేసిన మహనీయుడిగా ఆయన నిలిచారని అన్నారు. బండెనక బండి కట్టి, పదహారు బండ్లు కట్టి అంటూ తెలంగాణ సమాజాన్ని చైతన్యపరిచిన నాయకుడిగా, నిరక్షరాస్యులను కూడా ఉద్యమ బాట పట్టించిన గొప్ప వ్యక్తిగా రావి నారాయణ రెడ్డిని సిఎం ప్రశంసించారు.

దేశంలో మొట్టమొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కంటే ఎక్కువ మెజారిటీతో పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన ఘనత రావి నారాయణ రెడ్డికే దక్కిందని తెలిపారు. ప్రజా తీర్పును ప్రతిబింబించేలా తొలి పార్లమెంట్ భవనాన్ని నెహ్రూ రావి నారాయణ రెడ్డితో ప్రారంభింపజేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే 60 ఏళ్ల వయసులోనే ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తూ పార్టీ, రాజకీయ పదవులకు స్వచ్ఛందంగా వీడ్కోలు పలికిన నేతగా ఆయనను సీఎం అభివర్ణించారు.

మున్సిపల్ ఎన్నికల అనంతరం రావి నారాయణ రెడ్డికి తగిన గౌరవం కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి జాతీయ పురస్కారం లభించడం సముచితమని పేర్కొంటూ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఆయన పోషించిన పాత్రను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు అధ్యక్షుడు చాడ వెంకట్ రెడ్డి, కార్యదర్శి కందిమళ్ల ప్రతాప్ రెడ్డి తదితర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.